
సూర్యాపేట: పెద్దగట్టు జాతర మొదలైన క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు గమనించాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు రెండు రోజుల పాటు వర్తించనున్నాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై శనివారం అర్ధరాత్రి నుంచి వాహనాలను దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి వద్ద దారి మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా తరలిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు, కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా పంపిస్తారు.
ALSO READ | నల్గొండ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా మళ్లించనున్నారు. -కోదాడ వెళ్లే వాహనాలను కోదాడ, మునగాల, గుంపుల మీదుగా ఎస్సారెస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం నుంచి సూర్యాపేటకు రానున్నాయి. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వాహనాలు కుడకుడ, ఐలాపురం, ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపనున్నారు.
తెలంగాణలో రెండో అతి పెద్ద జాతరగా పెద్దగట్టు జాతర పేరుగాంచింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ జాతర ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే పెద్దగట్టు జాతర సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత అతి పెద్దది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతులస్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర దాదాపు 250 ఏండ్ల నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.