సంక్రాంతి పండగకు సొంతూళ్లకు పట్టణ వాసులు తరలివెళ్తున్నారు. దానికి తోడు విద్యా సంస్థలకు కూడా వారం రోజుల సెలవులు రావడంతో స్వగ్రామాలకు పయనమయ్యారు. ఫలితంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరకక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
పండగ పూట సొంతూళ్లకు జనాలు వెళ్తుండడంతో.. రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద తెల్లవారుజామున వాహనాల సందడి మొదలైంది. టోల్ బూత్ లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి. అయినప్పటికీ వాహనాలు అధిక సంఖ్యలో వస్తుండడంతో బారులు తీరి, ట్రాఫిక్ జామ్ అవుతోంది.