కరెంట్ పాక్ తగిలిన వ్యక్తి ప్రాణం కాపాడిన హైదరాబాద్ పోలీసులు

బంజారాహిల్స్‌ లో కరెంట్‌ షాక్‌తో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు "సీపీఆర్‌" చేసి ప్రాణాలు కాపాడారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఫుట్ పాత్ పై గుర్తు తెలియని వ్యక్తి కరెంట్ షాక్ కు గురయ్యాడు. విద్యుత్ బాక్స్ పట్టుకోవడంతో షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి.

అక్కడే డ్యూటీలో ట్రాఫిక్ ఎస్సై రాకేశ్ రెడ్డి, కానిస్టేబుల్స్ శంకర్, సాయి, మనోహర్, ప్రవీణ్ లు వెంటనే అతడికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. "సీపీఆర్‌" చేయడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. తర్వాత అతడిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కరెంట్ షాక్ తో వ్యక్తికి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసలు తెలిపారు. పోలీసులు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.