ఆగస్టు 20వ తేదీన సూర్యాపేటలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఆగస్టు 20వ తేదీ ఆదివారం సీఎం కేసీఆర్ సూర్యాపేటలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో ఆగస్టు 20వ తేదీన ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
సూర్యాపేటలోని 65వ నెంబరు జాతీయ రహదారి దగ్గర గల వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఆగస్టు 20వ తేదీన బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు.. ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఖమ్మం బైపాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
సీఎం సభతో ఉత్సాహం..
ఆగస్టు 20వ తేదీన సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముందుగా కలెక్టరేట్ ను , ఎస్పీ ఆఫీసును ప్రారంభిస్తారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
సీఎం సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే కాకుండా పరిసర జిల్లాల నుంచి రెండు లక్షల మందికి పైగా జనం హాజరవుతారని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. సభా వేదిక సమీపంలో వాహనాల పార్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బహిరంగ సభ.. సూర్యాపేట జిల్లాలోని క్యాడర్‌లో ఉత్సాహం నింపుతుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.