వానొస్తే వరద కష్టాలు.. భద్రాచలం ఏజెన్సీలో రాకపోకలకు అవస్థలు

  • ఫండ్స్​ లేక పనులు  కాక ఇబ్బందులు 
  • గతేడాది గోదావరి వరదలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీలకు 
  • రూ. 200కోట్లు అడిగితే  ఇచ్చింది రూ. 37కోట్లు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ​గతేడాది వచ్చిన భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలను  వరద నీరు చుట్టుముట్టింది. రాకపోకలు స్థంభించాయి. రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. లో లెవల్​ బ్రిడ్జీలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇలా వర్షం పడ్డ పత్రిసారీ ఏజెన్సీ గ్రామాలు వరదల్లో చిక్కుకుంటున్నాయి.   దెబ్బతిన్న రోడ్లకు రిపేర్ల కోసం, చప్టాల స్థానంలో బ్రిడ్జీలకు  ఆఫీసర్లు దాదాపు రూ. 200కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  

కానీ,  రూ. 37కోట్లు ఇచ్చి సర్కార్​ చేతులు దులుపుకుంది. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల  జిల్లాలోని పలు ప్రాంతాల్లోని లో లెవల్​ బ్రిడ్జీల వరద నీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్థంభించాయి. వానోస్తే చాలు ఏజెన్సీ వాసుల రాకపోకలకు కష్టాలు తప్పడం లేదు. 

వానొస్తే రోడ్లు బ్లాక్​.. 

గత నాలుగైదు రోజుల కిందట తుఫాన్​   బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన  వానలతో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.  పలు చోట్ల రాకపోకలను నిషేదించారు. 

చాలా చోట్లా ఇదే పరిస్థితి

అశ్వారావుపేట మండలంలోని వాగొడ్డుగూడెం వద్ద   రోడ్డుపై  వరద  ప్రవహిస్తోంది.  దొంతికుంట చెరువు  ఉప్పొంగడంతో  సమీపంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. ఊట్లపల్లి గ్రామంలో వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.  కొత్తగూడెం నుంచి పెనుబల్లి రోడ్​పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలను నిలిపేశారు. దమ్మపేట మండలంలోని నాచారం – నాగుపల్లి వెళ్లే రోడ్డు ఆసన్నగూడెం వద్ద మల్లెపూల వాగు రోడ్డుపై నుంచి దాదాపు రెండు అడుగుల మేరా  ప్రవహిస్తుండడంతో రాకపోకలను  నిలిపివేశారు.  

దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం వద్ద రోడ్డుపై వరద ఉధృతి పెరుగుతోంది. మండలంలోని పేరంటాల చెరువు వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు రెండు అడుగులకుపైగానే ప్రవహిస్తోంది. గణేశ్​ పాడు– నాచారం దగ్గర రాళ్లబంజర గ్రామం వద్ద రోడ్డుపై వరద నీటి ఉధృతితో రోడ్డు బ్లాక్​ అయింది. సుజాతనగర్​ మండలంలోని లక్ష్మీపేరం గ్రామం వద్ద వాగు ఉధృతితో రాకపోకలను నిలిపేశారు. జూలూరుపాడు మండలంలోని నరసాపురం– బేతాళపాడు రోడ్డుపై, చండ్రుగొండ మండలంలోని బాల్యాతండా– పోకలగూడెం వెళ్లే దారిలో రోడ్డుపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి–కుమ్మరిపాడు వెళ్లే దారిలోని బ్రిడ్జీపై నుంచి వరద  ప్రవహిస్తోంది.

ముత్యాలంపాడు బ్రిడ్జి వద్ద వరద ఉధృతితో రాకపోకలను నిలపేశారు. అశ్వాపురం – గొందిగూడెం వెళ్లే దారిలో ఇసుకవాగు ఉధృతితో రాకపోకలను ఆపేశారు. ఈ ఏడాది వర్షాకాలంలో కురిసన వర్షాలతో అశ్వాపురం మండలంలోని ఆమెర్ధ– అమ్మగారిపల్లి మధ్య గల బ్రిడ్జీపై గోదారి వరద నీరు చేరుతుండండంతో రాకపోకలు అంతరాయం కలిగింది.

తుమ్మల చెరువు గ్రామం సమీపంలోని లోతువాగుపై వరద ఉధృతితో పది గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.  వానాకాలం వస్తే చాలు గుండాల మండలంలో కిన్నెరసాని ఉప్పొంగి ప్రవహిస్తొంటుంది. దీంతో పలు ఏజెన్సీ గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన గుండాలకు రాలేని పరిస్థితి. పినపాక, దుమ్ముగూడెం,అశ్వాపురం, చర్ల, గుండాల, పాల్వంచ, చండ్రుగొండ, అశ్వారావుపేట తదితర మండలాల్లోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోని చప్టాలతో ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడడం కామన్​గా మారింది.

నిధులు రాక.. పనులకు ఆటంకం.. 

గతేడాది భారీ వరదలతో గోదారి గ్రామాలను ముంచెత్తింది. వరద ఉధృతితో రోడ్లు, బ్రిడ్జీలు దెబ్బతిన్నాయి.   దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు, లో లెవల్​ బ్రిడ్జీల స్థానంలో హై లెవెల్​ బ్రిడ్జీలు నిర్మించేందుకు రూ.  200 కోట్లు అవసరం అని ఆర్​అండ్​ బీ అధికారులు ప్రపొజల్స్​ పంపారు.   కాగా మార్చి నెలలో రోడ్ల రిపేర్లకు కేవలం రూ. 37కోట్లు శాంక్షన్​ చేసింది.

దీంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేకపోయారు.    ఈ క్రమంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని దాదాపు 10 నుంచి 15కు పైగా గల లో లెవట్​ బ్రిడ్జీల స్థానంలో కొత్తవి కట్టకపోవడంతో ప్రస్తుతం వస్తున్న వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.