హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేడియం చుట్టూ ట్రాఫిక్ఆంక్షలు విధించారు. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి రైల్వేస్టేషన్ లేదా రవీంద్రభారతి వైపు, బషీర్ బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద ఎస్ బీఐ, గన్ ఫౌండ్రీ, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు, సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు. అవసరాన్ని బట్టి రవీంద్రభారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్ వైపు మళ్లిస్తారు.