తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు నగర వాసులు . విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో ఫెస్టివల్ కు కుటుంబ సభ్యులతో కలిసి తమ వాహనాల్లో వెళ్తున్నారు. వాహనాల రాకపోకలతో జాతీయ, రాష్ట్ర రహదారులు రద్దీగా మారాయి. టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు క్యూ కట్టాయి.
హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
చౌటుప్పల్ మండలం జాతీయ రహదారిపై, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ గేట్లు ఉండగా విజయవాడ వైపు 10 టోల్ గేట్లను, హైదరాబాద్ వైపు 6 టోల్ గేట్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు టోల్ సిబ్బంది.
Also Read :- రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా.. మృతుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్
మరో వైపు నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర మొత్తం 12 టోల్ బూత్ లు ఉండగా.. విజయవాడ వైపు ఏడు టోల్ బూతులను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. సంక్రాంతి వాహనాల రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది టోల్ ప్లాజా యాజమాన్యం. అంబులెన్స్ ను క్రేన్ ను అందుబాటులో ఉంచారు టోల్ ప్లాజా సిబ్బంది. శాలిగౌరారం రూరల్ సిఐ కొండల్ రెడ్డి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీని పర్యవేక్షిస్తున్నారు.