హైదరాబాద్: మలక్పేట మెట్రో స్టేషన్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు రద్దీ టైంలో ఛలాన్లు వసూలు చేసేందుకు వాహనాలను ఆపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రతిరోజు మలక్ పేట్ ట్రాఫిక్ పోలీసులు ఉదయాన్నే వాహనాలను ఆపుతూ ఛలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని వాహనాదారులు చెబుతున్నారు.
ట్రాఫిక్ పోలీసులు ఇలా వాహనాలను ఆపడం వల్ల మరింత ట్రాఫిక్ జామ్ అవుతోందని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆఫీస్లకు వెళ్లే ఉద్యోగులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. చాదర్ ఘాట్ నుంచి మలక్ పేట వెళ్లే వాహనాలను మలక్ పేట రైల్వే బ్రిడ్జి వద్ద ఆపుతున్నారు.
Also Read :- స్థానిక సంస్థల ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు రెడీ
అసలే బ్రిడ్జ్ వద్ద రోడ్ చిన్నగా ఉండి ప్రతి రోజు వాహనాలు మలక్ పేట యశోద హాస్పిటల్ వరకు, ఇటు చాదర్ ఘాట్ వరకు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల తీరుతో మరింత ట్రాఫిక్ జామ్ అవుతుందని వాహనదారులు తెలిపారు.
అయితే.. ఇక్కడే ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేసి ఛలాన్లు కట్టించుకుంటూ ఉండటంతో ట్రాఫిక్ సమస్యను పట్టించుకోకుండా, మరింత ట్రాఫిక్ సమస్యకు కారకులు అవుతున్నారని వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.