నిజామాబాద్‌లో పెరుగుతున్న రద్దీతో అవస్థలు
హాస్పిటల్స్, వాణిజ్య సంస్థలున్న ఏరియాల్లో అస్తవ్యస్తం
నిజామాబాద్ సిటీలో డైలీ 15 వేలకు పైగా వాహనాల రాకపోకలు
ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని సిటీవాసుల డిమాండ్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జ్ వద్ద పనులు పూర్తి కాకపోవడంతో సిటీవాసులకు అవస్థలు తప్పడం లేదు. సిటీలో ఓవైపు వాహనాల రద్దీ.. మరోవైపు షాపింగ్ మాల్స్ సెట్ బ్యాక్ పాటించకపోవడంతో సమస్య తలెత్తుతోంది. రూల్స్ తరచూ ఛేంజ్ చేయకుండా రెగ్యులర్ నిబంధనలు విధించాలని సిటీజనాలు డిమాండ్ చేస్తున్నారు.
ఎక్కడ చూసినా రూల్స్ బ్రేక్
జిల్లా కేంద్రంలోని మెయిన్ ఏరియాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. సిటీలో సుమారు 14 వేల బైక్స్ , 1500 కార్లు, 300 ఆర్టీసీ , ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులున్నాయి. ఉదయం,సాయంత్రం వేళల్లో సిటీలో వాహనాలు రాకపోకలు ఎక్కువగా ఉంటుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మెయిన్ సెంటర్లలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా సెట్ బ్యాక్ లేకపోవడంతో సమస్యలు అధికమవుతున్నాయి. దేవీరోడ్, గాంధీ చౌక్ బస్టాండ్ రోడ్, వీక్లీ మార్కెట్ పెద్ద బజార్, ఖలీల్‌వాడి, ద్వారకానగర్, సరస్వతీ నగర్ ఏరియాల్లో విపరీతంగా రద్దీ ఉంటోంది. శ్రద్ధానంద్ గంజ్‌లోని అగ్రికల్చర్ మార్కెట్‌కు భారీ వాహనాలు వస్తుంటాయి. దీంతో దుబ్బ బైపాస్, కంఠేశ్వర్ నుంచి అంబేద్కర్ కాలనీ రోడ్డులో ట్రాఫిక్ పెరుగుతోంది. గాంధీ చౌక్, దేవీరోడ్, రాష్ట్రపతి రోడ్, వీక్లీ మార్కెట్ పుసాల గల్లీ, పెద్ద బజార్ ఏరియాల్లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు ప్రజలు ఈ రోడ్డు నుంచే వెళుతుండడంతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోంది. దేవీ రోడ్ సమీపంలోనే ఆర్టీసీ బస్టాండ్, గవర్నమెంట్ జనరల్హాస్పిటల్ ఉంది. గాంధీ గంజ్, శ్రద్ధానంద్‌గంజ్‌లో బిజినెస్లావాదేవీలు, గుర్బాబాది రోడ్ లో బ్యాంకులు ఉండటంతో ట్రాఫిక్కష్టాలు తప్పడం లేదు.
డైవర్షన్ తో ఆగమాగం
సిటీలో డైవర్షన్లు, వన్ వేలతో వాహనదారులు తికమకపడుతున్నారు. ఆర్యుబీ రోడ్ అప్రోచ్ పనులు స్లోగా జరుగుతుండటంతో ఖలీల్ వాడీ ప్రాంతంలో వన్ వే చేశారు. బస్టాండ్ సమీపంలో ఫ్లై ఓవర్ నుంచి దేవీరోడ్ వెళ్లే దారిని క్లోజ్ చేసి వన్ చేశారు. దీంతో నగరంలోని ఖలీల్‌వాడి, దేవీరోడ్ , గాంధీ చౌక్ వైపు వెళ్లాలంటే ఆర్యుబీ కంప్లీట్ కాకపోయినా అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు సాగుతున్నాయి.
భారీ వాహనాలు కంఠేశ్వర్ నుంచి హమాల్ వాడి వైపు , చంద్రశేఖర్ నగర్ కాలనీ చౌరస్తా నుంచి రైతుబజార్ మీదు గా దుబ్బ నుంచి నామ్ దేవ్ వాడ మీదుగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వైపు వెళుతున్నారు. రైల్వే లైన్ ఇటువైపు నుంచి కంఠేశ్వర్ సుభాశ్‌నగర్, కొత్త గంజ్, హమాల్ వాడి, ఎన్జీవోస్ కాలనీ, చంద్రశేఖర్ నగర్, హౌసింగ్ బోర్డు ప్రాంతాలకు ఎన్టీఆర్ చౌరస్తా, అండర్ బ్రిడ్జి నుంచి వన్ వే చేశారు. రైల్వే ఫ్లై ఓవర్ గుర్బాబాది రోడ్డు మీదుగా డైవర్షన్ చేశారు. 10 నెలలుగా ట్రాఫిక్‌కు డైవర్షన్ ల తో అర్బన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వన్ వే తో అవస్థలు పడుతున్నాం
అర్బన్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. వన్ వే పై సమాచారం లేక తికమక పడుతున్నాం. సిటీలోకి వెళ్లాలంటే వన్ వే వల్ల ఆలస్యమవుతోంది. జడ్పీ చౌరస్తా వద్ద బారికేడ్లు పెట్టారు. ఇక్కడి నుంచి ఎటువెళ్లాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయలేదు. సిటీలోకి వెళ్లడం ప్రయాసగా మారుతోంది. సడన్ గా భారీ వాహనాలు ఎదురుగా వస్తుండటంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. హాస్పిటల్స్ వెళ్లే పేషంట్లు ఇబ్బందులు పడ్తుండ్రు. - నగేశ్ రెడ్డి, స్థానికుడు
ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయట్లే..
ట్రాఫిక్ ను కంట్రోల్‌చేయడంలో సిబ్బంది ఫెయిలైన్రు. ఛలాన్ ల మీద ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ కంట్రోల్ మీద లేదు. మెయిన్ రోడ్లపైనే వెహికల్స్ పార్క్ చేస్తున్రు. రోడ్ సెట్ బ్యాక్ తో నిర్మాణాలు లేకున్నా మున్సిపల్ ఆఫీసర్లు పట్టించకుంటలేరు. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వన్ వే రోడ్లపై సమాచారంతో అర్బన్ వాసులను అలర్ట్చెయాలే. - కె. రామకృష్ణ, ఇందూరువాసి
తెలంగాణా సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కోటగిరి, వెలుగు: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోటగిరి మండలం కల్లూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఆడపడుచులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారని, పండుగకు ప్రభుత్వం తరఫున మహిళలకు చీరలు బహుమతిగా ఇవ్వటం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. కల్లూర్, లింగపూర్గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో పదివేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్, సర్పంచ్‌లు లక్ష్మి, హన్మంతు, ఎంపీటీసీ సుజాత పాల్గొన్నారు.
ఘనంగా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్, టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మేయర్ నీతూ కిరణ్, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ప్రతిమా రాజ్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది
రౌండ్ టేబుల్ సమావేశంలో లీడర్లు
నిజామాబాద్ టౌన్, వెలుగు: రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీని తరిమేద్దామని విద్యార్థి సంఘాలు, వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఇ. శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చీఫ్‌గెస్ట్‌లుగా ఓయూ జేఏసీ వ్యవస్థాపకుడు, టీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నాయకులు డి.రాజారాం యాదవ్, ఓయూ చైర్మన్ మాందాల భాస్కర్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు డా.ఎల్చల దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఐటీ లను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ యెండల ప్రదీప్, అంగరీ ప్రదీప్, వివిధ సంఘాల నాయకులు సదానందం, సుధాకర్, ఆకుల పాపయ్య, పెద్ది వెంకటరములు, మోహన్ రావు, కొక్కెర భూమన్న, హోమయ్య పాల్గొన్నారు.
త్వరలో పిట్లం సీహెచ్‌సీ పనులను ప్రారంభిస్తాం
ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
పిట్లం, వెలుగు: పిట్లంలో సీహెచ్‌సీ బిల్డింగ్పనులు త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తెలిపారు. శనివారం పిట్లం హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని పేషంట్లకు ట్రీట్ మెంట్ చేయడానికి ఇబ్బందిగా ఉందని మెడికల్ ఆఫీసర్ శివకుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ 50 పడకల హాస్పిటల్, మండలంలో నిర్మించే పీహెచ్సీ కోసం ప్రపోజల్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ద్వారా నిధులు మంజూరు చేయించి హాస్పిటల్ పనులకు శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టీచర్లు సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ మెంబర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, బాబుసింగ్మెడికల్ఆఫీసర్రోహిత్కుమార్ పాల్గొన్నారు.
పండుగను సంతోషంగా జరుపుకోవాలి
కామారెడ్డి , వెలుగు: బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి దేవునిపల్లిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. నియోజక వర్గంలో 98వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. లైబ్రరీ జిల్లా చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, లీడర్లు వేణుగోపాల్‌రావు, అంజయ్య పాల్గొన్నారు. పిట్లం, వెలుగు: జుక్కల్ ఎంపీపీ ఆఫీసులో శనివారం మహిళలకు ఎమ్మెల్యే హన్మంత్‌షిండే బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుర్నర్ యశోద, వైస్ ఎంపీపీ ఉమాకాంత్, ఏఎంసీ చైర్మన్సాయాగౌడ్, సొసైటీ చైర్మన్శివానంద్, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో రవీశ్వర్‌గౌడ్, ఏపీఎం సత్యనారాయణ పాల్గొన్నారు.
పలుగుగుట్ట రక్షణకే భూములు కొనుగోలు చేశాం
కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్
నందిపేట, వెలుగు: నందిపేట మండల కేంద్రానికి సమీపంలోని కేదారీశ్వర ఆశ్రమం పలుగు గుట్టపైనే వెలసినందున గుట్ట పరిరక్షణ, పర్యావరణ వృద్ధి కోసమే ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న భూములను కొనుగోలు చేసినట్లు కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలిపారు. రెండు రోజులుగా ఈ భూములపై సోషల్‌మీడియాలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శనివారం భూములు విక్రయించిన రైతులతో కలిసి మహారాజ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. సర్వే నెంబరు 57,60,61,62 లో ని గుట్ట మొత్తం 155 ఎకరాలు పట్టా కాగా ఇందులో తల్వేద, అయిలాపూర్, చింరాజ్‌పల్లి, నందిపేట కు చెందిన 150 మంది రైతులు పట్టాదారులన్నారు. ఇందులో 90 ఎకరాలకు పైగా పలువురు కొనుగోలు చేశారని తెలిపారు. భక్తులు, దాతలు ఇచ్చిన విరాళాలతో ఆశ్రమం పేరుమీద కొనుగోలు చేశామని, ఎవరికీ సంబంధం లేదని మహారాజ్ తెలిపారు.
మహారాజ్ ను పరామర్శించిన మాజీ మంత్రి
నందిపేట కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌ను శనివారం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. మహారాజ్ తల్లి మంగి లక్ష్మమ్మ ఇటీవల చనిపోయారు. దీంతో ఆశ్రమానికి వచ్చి సుదర్శన్‌రెడ్డి మహారాజ్‌ను పరామర్శించారు. నియోజకవర్గ ఇన్చార్జి ఏబీ చిన్నా, కాంగ్రెస్ లీడర్లు తాహెర్‌బిన్ హందాన్, ఇంద్రుడు, మహిపాల్, ప్రశాంత్, గంగాధర్ పాల్గొన్నారు.
దేవీ మండపాలకు చీరల అందజేత
నిజామాబాద్, వెలుగు: దేవీ నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని, హిందువుల పండుగలు దేశ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న 255 దేవీ మండపాలకు ధన్ పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యనారాయణ, మణిమాల దంపతులు శనివారం పట్టుచీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి తర్వాత పండుగలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక , సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందూరు అర్బన్ పరిధిలో ఎవరికి ఆపద వచ్చినా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూత అందిస్తున్నామని అన్నారు. ఆలయాల పునరుద్ధరణకు ట్రస్ట్ తరఫున సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
మద్నూర్‌లో బీజేపీ ‘లోకల్ ఫర్ వోకల్’
పిట్లం, వెలుగు: కుల, చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అన్నారు. శనివారం మద్నూర్ మండల కేంద్రంలో ‘లోకల్ ఫర్ వోకల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో కనుమరుగువుతున్న చేతి వృత్తులు, కుల వృత్తులపై అవగాహన పెంచడానికి15 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాము, వైస్ ప్రెసిడెంట్ సతీశ్జాదవ్, లీడర్లు హన్మాండ్లు, శివాజీరావు, కృష్ణ పటేల్, ధనుంజయ్ పటేల్, అరుణ్పటేల్ పాల్గొన్నారు.
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
నందిపేట, వెలుగు: నందిపేట మండలంలో బీజేపీ పటిష్టతకు కృషి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి అన్నారు. శనివారం డొంకేశ్వర్ గ్రామంలో నిర్వహించిన బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మూడు బూత్‌కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరె గంగాధర్, జిల్లా కార్యదర్శి సురేందర్, ఉదయ్‌కుమార్, సాగర్, మహేందర్ గౌడ్, నర్సయ్య పాల్గొన్నారు.
ధరణి సమస్యలు పరిష్కరించాలి
బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
కామారెడ్డి , వెలుగు: ధరణితో రైతుల గోస , భూ అక్రమాలపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ నియోజక వర్గ ఇన్చార్జీ కాటిపల్లి వెంకటరమణరెడ్డితో పాటు పలువురు లీడర్లు, కార్యకర్తలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరానికి ఆయా గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి మద్దతు తెలిపారు. ధరణితో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు వివరించారు. ఈ సందర్భంగా వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ... ధరణితో రైతుల భూములన్నీ ఆఫీసర్ల గుప్పిట్లోకి వెళ్లాయన్నారు. రైతులు తమ సమస్యలను చెబితే ఆఫీసర్లు పట్టించుకోవటం లేదన్నారు. కలెక్టర్ స్పందించకుంటే మంగళవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
విముక్తి పోరాటాలకు సిద్ధం కావాలి
ఆర్మూర్, వెలుగు: మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని, మహిళా విముక్తి పోరాటాలకు సిద్ధంకావాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ పిలుపునిచ్చారు. పీవోడబ్ల్యూ జిల్లా ఏడో మహాసభ శనివారం ఆర్మూర్ లో నిర్వహించారు. పీవోడబ్ల్యూ జిల్లా ప్రెసిడెంట్గోదావరి జెండాను ఆవిష్కరించిన అనంతరం ర్యాలీ జరిపి సభ నిర్వహించారు. సభలో చండ్ర అరుణ మాట్లాడుతూ... అక్టోబర్ 8, 9న నారాయణపేట జిల్లాలో జరిగే పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కృష్ణ, డివిజన్ కార్యదర్శి ప్రభాకర్, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సంధ్య, ఉపాధ్యక్షులు జమున, సహాయ కార్యదర్శి నాగమణి పాల్గొన్నారు.