
- మహిళ ఇంటికెళ్లి చలానా ఇచ్చిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: కారులో వెనక సీట్లోనో, డ్రైవర్ పక్క సీట్లోనో కూర్చుని వర్క్ చేస్కుంటే పర్లేదుగానీ, ఓ మహిళ ఏకంగా డ్రైవింగ్ చేస్తూనే ల్యాప్‌ట్యాప్‌లో ఆఫీస్ వర్క్ చేస్కున్నారు. ఇది గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.
బెంగళూరులోని ఆర్టీ నగర్లో జరిగిన ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు ఆరా తీశారు. ఆమె కారు నంబర్ ద్వారా అడ్రస్ ట్రేస్ చేసి, అమె ఇంటికి వెళ్లారు. రూ.వెయ్యి పెనాల్టీ వేసి చలానాను ఆమెకు అందజేశారు.
వర్క్ ఫ్రమ్ హోం అంటే ఇంట్లో కూర్చుని పనిచేసుకోవాలిగానీ, కారులో డ్రైవ్ చేస్తూ కాదని పేర్కొంటూ వైరల్ వీడియోతోపాటు, చలానాను మహిళకు అందజేసిన ఫొటోను పోలీసులు షేర్ చేశారు. అది ఇతరుల ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు.
అయితే, కారు నడుపుతూ వర్క్ చేస్తున్న ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలాది మంది నెటిజన్లు చూసి సెటైర్లు వేశారు. పెనాల్టీ వేయడంతోపాటు, ఆమె పనిచేస్తున్న కంపెనీకి కూడా జరిమానా విధించాలని పోస్టులు పెట్టారు.