హైదరాబాద్లో యువకుడి ప్రాణాలు తీసిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ఓవర్​యాక్షన్​

హైదరాబాద్లో యువకుడి ప్రాణాలు తీసిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ఓవర్​యాక్షన్​

కూకట్​పల్లి, వెలుగు: బాలానగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ఓవర్​యాక్షన్ ​ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తనిఖీల్లో భాగంగా టూ వీలర్​పై వస్తున్న యువకుడిని అంగి పట్టి గుంజడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయాడు. ఈ ఘటనను నిరసిస్తూ యువకుడి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​ఏర్పడింది. వారిని కంట్రోల్​చేయడానికి ఒకదశలో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. పోలీసులు, బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. షాపూర్​నగర్​ పరిధిలోని రోడామిస్త్రీ నగర్​లో ఉండే జోషిబాబు(35) కార్పెంటర్.

ఇతను పంజాగుట్టలో పని ఉండి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బైక్​ పై బయలుదేరాడు. ఒంటిగంటకు ఐడీపీఎల్​ టౌన్​షిప్​ మెయిన్​గేటు వద్దకు చేరుకున్నాడు. అదే టైంలో అక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ సిబ్బంది జోషిబాబు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అయితే, అతడు బైక్​నడుపుతుండగా గోపాల్​అనే ట్రాఫిక్​కానిస్టేబుల్​జోషిబాబును పక్కకు లాగే ప్రయత్నం చేయగా, జోషిబాబు మరో బైక్​ని ఢీకొని రోడ్డు మీద పడ్డాడు. అదే టైంలో అటుగా వస్తున్న మెదక్​ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కిందపడగా తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. 

స్థానికులు, బంధువుల ఆందోళన
ట్రాఫిక్​ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జోషిబాబు చనిపోయాడంటూ స్థానికులు, యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

ట్రాఫిక్​ కానిస్టేబుల్​ తాగి ఉన్నాడంటూ, వెంటనే యాక్షన్​తీసుకోవాలంటూ అతడి వీడియోలు తీస్తూ పోలీసులను ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్​ చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి ట్రాఫిక్​ పోలీసుల తప్పు ఉంటే శిక్షిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేయడంతో స్థానికులు, బంధువులు ఆందోళన విరమించారు. చివరకు ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ట్రాఫిక్​ కానిస్టేబుల్​ గోపాల్​పై బాలానగర్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.