- అదనపు అలవెన్సుల కోసం అటాచ్ పేరిట వేరే చోట విధులు?
- సిబ్బంది కొరతతో జగిత్యాలలో ట్రాఫిక్ కష్టాలు
- 28 మందికి 20 మంది సిబ్బంది కేటాయింపు.. వారిలో 9 మంది అటాచ్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలో సిబ్బంది కొరతతో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ డ్యూటీలకు అదనంగా వచ్చే అలవెన్స్ కోసమే పోస్టింగులు పొంది అటాచ్ పేరు మీద మరో స్టేషన్ లో డ్యూటీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు సరిపడా సిబ్బంది లేక సమస్యలు తలెత్తుతున్నాయి. జగిత్యాలలో ట్రాఫిక్ కంట్రోలింగ్‌కు తొమ్మిదికి పైగా పికెటింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో పనిచేసేందుకు ట్రాఫిక్ పీఎస్‌లో మొత్తం 28 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 20 మందిని కేటాయించారు. వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది అటాచ్ అయ్యారు. మిగతా 11 మందితో ఉండడంతో టౌన్‌లో ట్రాఫిక్ కంట్రోల్ తప్పి సమస్యలు తలెత్తుతున్నాయి.
జగిత్యాలలో ట్రాఫిక్ కష్టాలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇరుకు రోడ్లతో పాటు వాణిజ్య సముదాయాలు, హాస్పిటళ్లలో పార్కింగ్ సౌకర్యం లేక వాహనాలు రోడ్డు పై పార్క్ చేస్తున్నారు. ముఖ్యంగా టవర్ సర్కిల్, జంబిగద్దె, ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్య లో టూవీలర్, ఫోర్ వీలర్లు రోడ్డు పైనే నిలుపుతుండడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది బదిలీల నేపథ్యంలో ట్రాఫిక్ పోస్టింగు కోసం పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పటికైనా అటాచ్ కాకుండా డ్యూటీలు చేసే ఆఫీసర్లకు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది.
28 మందికి 11 మందే పనిచేస్తున్నారు
ట్రాఫిక్ డ్యూటీలకు అదనంగా వచ్చే అలవెన్స్ కోసమే పోస్టింగులు పొంది అటాచ్ పేరు మీద మరో స్టేషన్ లో డ్యూటీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 28 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 11 మందే పనిచేస్తున్నారు. మొత్తంగా ఓ ఎస్, ఇద్దరు ఏఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా సిబ్బంది కొరతతో12 కానిస్టేబుళ్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఎస్‌ఐలు, ఓ ఎస్‌ఐతోపాటు ఆర్‌ఎస్‌ఐని కేటాయించారు. వీరిలో తొమ్మిది మంది వేరే పీఎస్‌లకు అటాచ్ అయ్యారు. ప్రస్తుతం ఎస్‌ఐతోపాటు ఆర్ఎస్సై, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు హెడ్, ఆరుగురు కానిస్టేబుళ్లు మాత్రమే పని
చేస్తున్నారు.