
- బిజినెస్ అడ్డాలుగా ఫుట్‌పాత్ లు.. సెల్లార్లు
- పార్కింగ్ ప్లేసులను తలపిస్తున్న మెయిన్ రోడ్లు
- వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
- జంజీర్ తరహా ప్లాన్ తయారు చేయాలనే విన్నపాలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో వాహనాల సంఖ్య పెరిగిపోవడం, చాలాచోట్ల ఫుట్ పాత్‌లు, రోడ్లు ఆక్రమణకు గురి కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సిటీలో సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో పాటు కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్ సెల్లార్లను ఇతర అవసరాలకు ఉపయోగిస్తుండటంతో జనాలు బండ్లన్నీ రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాగా ఆపరేషన్ జంజీర్ పేరున తోపుడు బండ్లకు కళ్లెం వేస్తున్న పోలీసులు.. కాంప్లెక్సులు, మాల్స్, ఇతర బిల్డింగ్స్ రోడ్లనే పార్కింగ్ ప్లేసులుగా వాడుతూ ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నా వాటిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి.
ఆక్రమణలో ఫుట్ పాత్‌లు, నిరుపయోగంగా సెల్లార్లు
నగరంలోని మాల్స్, కాంప్లెక్సులకు వచ్చే వెహికిల్స్ కు తగ్గట్టుగా అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు లేవు. కొన్నిచోట్ల సెల్లార్లు ఉన్నా వాటిని ఇతర అవసరాలకు వాడుతున్నారు. హంటర్ రోడ్డులో ఓ చోట సెల్లార్ లోనే బార్, బాలసముద్రంలో హాస్పిటల్, మరో చోట టీ స్టాల్, సెక్యూరిటీ రూమ్స్, ఆఫీస్ రూమ్స్ ఇలా సెల్లార్లను ఒక్కో చోట ఒక్కో అవసరాలకు వాడుతుండడంతో బండ్లు నిలిపేందుకు రోడ్లే దిక్కవుతున్నాయి. ఇదిలాఉంటే సిటీలో ఫుట్ పాత్‌లు చాలాచోట్లా కనుమరుగయ్యాయి. ఫుట్ పాత్ లపైనే ఫుడ్ స్టాల్స్, టీ స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా.. బడా కాంప్లెక్స్‌లు ఫుట్ పాత్లను తమ వెహికిల్స్ పార్కింగ్ కోసం వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా సుబేదారి, ఆదాలత్, నక్కలగుట్ట, కిషన్ పుర, నయీంనగర్, కేయూ జంక్షన్, ములుగురోడ్డు తదితర చోట్ల ఫుట్ పాత్ లే బిజినెస్ అడ్డాలుగా మారాయి. ఇక హనుమకొండ, వరంగల్ చౌరస్తాల్లో కనీసం చూద్దామన్నా ఫుట్ పాత్ లు కనిపించవు. దీంతో జనాలు రద్దీ ఉన్నా నడిరోడ్ల మీదనే నడవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
బండ్లన్నీ రోడ్ల మీదనే
వరంగల్ నగరంలోని వివిధ ఆఫీసులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ తదితర అవసరాల నిమిత్తం నిత్యం లక్షల వాహనాలు వస్తుంటాయి. రోజూ సగటున 40 వేల వరకు కార్లు, 80 వేల వరకు ఆటోలు, రెండు లక్షల వరకు బైకులు నగర రోడ్లపై తిరుగుతున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. కానీ వచ్చీపోయే వాహనాలకు తగ్గట్టుగా నగరంలో పార్కింగ్ ప్లేసుల్లేవు. దీంతో స్మార్ట్ సిటీ స్కీమ్‌లో భాగంగా సిటీలోని అశోక జంక్షన్, భద్రకాళి టెంపుల్ ఏరియాలో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేసేందుకు గతంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ప్రతిపాదించారు. ఆ తరువాత వివిధ కారణాల వల్ల పార్కింగ్ కాంప్లెక్స్‌లను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నుంచి తొలగించారు. అనువైన స్థలాలు లేకపోవడంతో సిటీకి వచ్చే వాహనాలను రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడే పార్క్ చేస్తున్నారు. ట్రై సిటీలోని ఫాతిమానగర్, నిట్ ఏరియా, హనుమకొండ కలెక్టరేట్, నక్కలగుట్ట, చౌరస్తా, మండిబజార్, బట్టలబజార్, వరంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో చూస్తే సమస్య తీవ్రత కనిపిస్తుంది.
జంజీర్ తరహా ప్లాన్ చేస్తే బెటర్
వరంగల్ ట్రై సిటీలో తోపుడు బండ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో సీపీ ఆదేశాల మేరకు పోలీసులు 'ఆపరేషన్ జంజీర్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తోపుడు బండ్లు రోడ్ల మీదకు రాకుండా వాటిని కట్టడి చేస్తున్నారు. వాస్తవానికి సిటీలో తోపుడు బండ్ల కంటే రోడ్ల మీద బైకులు, కార్ల పార్కింగ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులే ఎక్కువ. దీంతోనే రోడ్లను పార్కింగ్ ప్లేసులుగా వినియోగిస్తున్న కాంప్లెక్స్‌లు, మాల్స్, ఇతర బిల్డింగులపై దృష్టి పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్కింగ్ ప్లేసులు చూపడంతో పాటు ఆక్రమణకు గురైన ఫుట్ పాత్‌లు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న సెల్లార్లపై మున్సిపల్, పోలీస్ ఆఫీసర్లు సరైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.