కామారెడ్డి టౌన్‌‌లో ట్రాఫిక్ కష్టాలు.. విస్తరణపై దృష్టి పెట్టని యంత్రాంగం

కామారెడ్డి టౌన్‌‌లో ట్రాఫిక్ కష్టాలు.. విస్తరణపై దృష్టి పెట్టని యంత్రాంగం

కామారెడ్డి , వెలుగు : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. భవిష్యత్‌‌ అవసరాలను దృష్టిలో  పెట్టుకుని   టౌన్‌‌లలో  మౌలిక వసతుల కల్పన, డెవలప్‌‌మెంట్‌‌కు యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డిలో  మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డి టౌన్ జనాభా లక్షకు పైగా ఉంది. వ్యాపారం, చదువుకునేందుకు, ఇతరత్రా పనుల కోసం  ప్రతి రోజు వేలాది మంది వచ్చి పోతుంటారు. రోడ్లపై తిరిగే వెహికల్స్ సంఖ్య  కూడా పెరిగింది.  టౌన్‌‌లో ట్రాఫిక్ కష్టాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల విస్తరణ చేపట్టే మాటెమోగాని ట్రాఫిక్​ ఉండే రోడ్లను కుదిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.  20 ఏండ్ల తర్వాత కామారెడ్డి టౌన్‌‌కు సంబంధించి కొత్త మాస్టర్​ ప్లాన్‌‌ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో  తయారు చేయించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్లాన్ ఇటీవల రిలీజ్ చేశారు. ప్లాన్ తయారీపై ఆయా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్‌‌తో పాటు మున్సిపాల్టీలో విలీనమైన గ్రామల శివారుల్లో నుంచి 100 ఫీట్ల  రోడ్ల ప్రతిపాదనలపై  రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎవరితో సంప్రదించకుండా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంపై మున్సిపల్ ఆఫీసర్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పరిస్థితి ఇది.. 

కొత్త బస్టాండ్‌‌ మెయిన్​ రోడ్డు నుంచి  చర్చి పక్క ఆశోక్​నగర్ కాలనీ రోడ్డు, రైల్వే గేట్ వరకు  ఉన్న 80 ఫీట్ల  రోడ్డును 60 ఫీట్లకు చేశారు. సిరిసిల్లా రోడ్డు  రాజీవ్ పార్కు అవతలి నుంచి నవాబు వెంచర్ నుంచి పాత టౌన్​ మీదుగా బడా కసాబ్​గల్లి నుంచి వికాస్​నగర్, మెయిన్​రోడ్డు జీవదాన్​గుండా నిజాంసాగర్​ రోడ్డు వరకు గత మాస్టర్​ప్లాన్‌‌లో 80 ఫీట్ల రోడ్డు ఉండగా దీన్ని కూడా  60 ఫీట్లకు తగ్గించారు. పాత, కొత్త టౌన్‌‌ను కలిపే రోడ్డును తగ్గించారు. ఇప్పటికే ఉన్న మెయిన్​ రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా డెవలప్​మెంట్ చేయాల్సిన గత మాస్టర్ ప్లాన్‌‌​ రోడ్లను తగ్గించారు. 200 ఫీట్ల మెయిన్ రోడ్డును 150 ఫీట్లకు చేస్తున్నారు. 

ఇరుకు రోడ్లతో ఇబ్బందులు

టౌన్‌‌లో  ఇరుకు రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్​రోడ్డు, స్టేషన్​రోడ్డు, సుభాష్​ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, తిలక్​రోడ్డు,  జేపీఎన్​రోడ్డు, పాత బస్టాండ్‌‌ ఏరియాలో  వెహికల్స్ రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గత మాస్టర్​ ప్లాన్‌‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టడం, డ్రైనేజీల నిర్మాణం చేయకుండా  మళ్లీ పాత పద్ధతిలోనే నిర్మాణాలు చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షకాలంలో  నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. 

టౌన్‌‌కు దూరంగా 100 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలు

టౌన్‌‌కు దూరంగా విలీన గ్రామల మీదుగా  కొత్తగా 100 ఫీట్ల  రోడ్లకు ప్రతిపాదనలు పెట్టారు. లింగాపూర్, దేవునిపల్లి, టెకిర్యాల్ గ్రామాల  శివారుల్లో నుంచి  రైతుల అగ్రికల్చర్ భూముల్లో 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాధించారు.  100 ఫీట్ల రోడ్లు 3 కూడా ఇదే  ఏరియాలో ప్రతిపాదించారు. కొత్తగా చేసే కొన్ని వెంచర్లకు అనుకూలంగా రోడ్లను ప్రతిపాధించారని  రైతులు  పేర్కొంటున్నారు .

కామారెడ్డి టౌన్‌‌లోని జన్మభూమి రోడ్డు.  నిజాంసాగర్​ రోడ్డు జీవదాన్ నుంచి  విద్యానగర్ కాలనీ, పాత సాయిబాబా గుడి ముందు నుంచి కొత్త బస్టాండు పక్క నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉంటుంది. విద్యానగర్, ఎన్జీవోస్‌‌ కాలనీ,  కాకతీయ నగర్, ఆర్య నగర్‌‌‌‌తో పాటు దేవునిపల్లి తదితర ఏరియాలకు ఈ రోడ్డు గుండా వెళ్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది. 80 ఫీట్లు ఉన్న ఈ రోడ్డును కొత్త మాస్టర్ ప్లాన్‌‌లో 60 ఫీట్లకు కుదించారు.  ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి నిర్మాణాలు  చేశారు. వాటిని తొలగించి రోడ్డు వేడల్పు చేయాల్సిన యంత్రాంగం రద్దీ రోడ్డును కుదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంత మందికి మేలు చేసేందుకే  మార్పులు జరిగాయనే చర్చ జరుగుతొంది.

డెవలప్‌‌మెంట్‌‌ జరిగేలా ప్లాన్​

టౌన్​ డెవలప్‌‌మెంట్‌‌ జరిగేలా మాస్టర్ ప్లాన్​ తయారు చేశారు. ముసాయిదా ప్లాన్‌‌పై అభ్యంతరాలు ఉంటే తెల్పవచ్చు. అభ్యంతరాలను పరిశీలిస్తాం. కౌన్సిల్‌‌లో కూడా చర్చిస్తాం. - దేవేందర్, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి