రోడ్డెక్కితే ట్రా‘ఫికర్’

  • సిటీ రోడ్లపై నరకం చూస్తున్న వాహనదారులు
  • వాన కురిసిన టైంలో సమస్య మరింత తీవ్రం  
  • నిన్న తెల్లవారుజామున కురిసిన వానకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్
  • ఫ్లైఓవర్ల వద్ద నిలిచిన నీరు.. మధ్యాహ్నం దాకా తొలగని వరద

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో ట్రాఫిక్​సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. వెహికల్​తో రోడ్డెక్కితే గంటల తరబడి ట్రాఫిక్​లో చిక్కుకోవాల్సి వస్తోంది. వానల టైంలో సిటీ రోడ్లపై వాహనదారులకు నరకం కనిపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామూన కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలాచోట్ల మధ్యాహ్నం 12 గంటల వరకు వరద నీరు తొలగలేదు. ప్రధానంగా ఫ్లైఓవర్లు ఎక్కి, దిగే చోట నీరు నిలబడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​స్తంభించింది.

సిటీ మొత్తం వెహికల్స్ మూవ్ మెంట్ స్లోగా సాగింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ట్యాంక్  బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, రవీంద్రభారతి, బేగంపేట, ప్యారడైస్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, కేపీహెచ్ బీ,  మాదాపూర్, సైబర్​టవర్స్, ఐకియా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచింది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అవుతున్నాయి.

ఎల్బీనగర్ చింతల్​కుంటలోని విజయవాడ నేషనల్​హైవేపై ప్రతిసారి మోకాలు లోతున వర్షపు నీరు నిలుస్తోంది. ఫలితంగా నాలుగైదు కిలోమీటర్లు వెహికల్స్​స్తంభిస్తున్నాయి. కొన్నిచోట్ల చిన్నపాటి వానకు కూడా ట్రాఫిక్​సమస్య తలెత్తుతోంది. కోర్ సిటీ నుంచి బయటకు వెళ్లేందుకు దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. 

ఈ ప్రాంతాల్లో రోజూ సమస్యే

వానలు కురిసే సమయంలోనే కాకుండా మామూలు రోజుల్లోనూ కొన్ని ప్రాంతాలు ట్రాఫిక్ కు అడ్డాగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఏండ్లుగా ట్రాఫిక్​సమస్య తీరడం లేదు. మాసబ్ ట్యాంక్ నుంచి నానల్ నగర్ జంక్షన్ దాటేందుకు 3.3 కిలోమీటర్లు ప్రయాణానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతోంది. పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ ప్రాంతాల్లో రోజూ ట్రాఫిక్ నిలుస్తోంది. లక్డీకాపూల్ వద్ద ఇదే పరిస్థితి ఉంటోంది. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లక్డీకాపూల్ వరకు రోజూ జామ్ అవుతోంది.

సాయంత్రం సమయంలో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వాహనాలతో స్తంభిస్తోంది. ఒక్కోసారి ఎన్టీఆర్ గార్డెన్ వరకు వాహనాలు నిలుస్తున్నాయి. కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ నుంచి జేఎన్​టీయూ మెట్రో స్టేషన్​వరకు వాహనదారులు బారులు తీరుతున్నారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు వెహికల్స్​మూవ్​మెంట్​చాలా స్లోగా ఉంటోంది. అఫ్జల్ గంజ్ నుంచి ఎంజే మార్కెట్​కు వచ్చే రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఐటీ కారిడార్ లోని పలు ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.

రాయదుర్గం సిగ్నల్ దాటేందుకు దాదాపు 30 నిమిషాల టైం పడుతుంది. దిల్ సుఖ్ నగర్, కోఠి ఇలా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. సిగ్నల్ ఫ్రీ సిటీ పేరుతో చాలా చోట్ల సిగ్నల్స్ ను ఎత్తేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సిగ్నల్స్ ను తొలగించారు. కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పైగా వాహనదారులకు జర్నీ పెరిగింది. యూ టర్న్​కోసం కిలోమీటర్​నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.