మానుకోటకు ఓఆర్ఆర్​ .. తొలగనున్న ట్రాఫిక్​కష్టాలు

మానుకోటకు ఓఆర్ఆర్​ .. తొలగనున్న ట్రాఫిక్​కష్టాలు
  • 10.5 కిలో మీటర్లతో ఔటర్​ రింగ్​రోడ్డు​
  • రూ.125 కోట్లతో సీఎంకు  ప్రతిపాదనలు
  • మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే

మహబూబాబాద్, వెలుగు : మానుకోట పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చెక్​ పడనున్నది.  ఔటర్​ రింగ్​రోడ్డు  నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇటీవల మున్సిపల్​ ఆఫీసర్లు ప్రాథమికంగా ఔటర్​రింగ్​రోడ్డు నిర్మాణానికి రూ.24 లక్షలు కేటాయించి సర్వే చేయాలని తీర్మానించారు. జిల్లా కేంద్రంలో సుమారు 10.5 కిలోమీటర్లతో ఔటర్​రింగ్​రోడ్డు నిర్మాణానికి రూ.125 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర నివేదికను రూపొందించారు. 

మహబూబాబాద్​ ఎమ్మెల్యే మురళీనాయక్ ఔటర్​ రింగ్​ రోడ్డు  నిర్మాణం ఆవశ్యకతను  ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సలహాదారుడు, స్థానిక మాజీ ఎమ్మెల్యే  వేం నరేందర్​ రెడ్డి ద్వారా ప్రతిపాదనలు సీఎం రేవంత్​ రెడ్డికి చేరాయి. ఓఆర్ఆర్​ నిర్మాణానికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆర్థికశాఖ అనుమతి రాగానే ఔటర్​ రింగ్​ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడనున్నాయి.  

హైవేలకు అనుసంధానం.. 

వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు ఆరు ప్రధాన రహదారులున్నాయి. పట్టణంలో ప్రతిపాదిస్తున్న ఔటర్​ రింగ్​ రోడ్డు  రెండు జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి సుమారు 2 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మొత్తంగా 10.5 కిలో మీటర్ల ఓఆర్​ఆర్​ నిర్మాణానికి రూ.125 కోట్లకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా. రోడ్డు కోసం 70 శాతం ప్రభుత్వ భూముల నుంచే రహదారి వెళ్లనుంది.

 మిగిలిన 30 శాతం పట్టా భూములు కాగా, వారి నుంచి స్థల సేకరణ కోసం రూ.25 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మిగిలిన రూ.100 కోట్లతో వంద అడుగుల వెడల్పుతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించారు. మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ట్​ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. దారి పొడవునా అవసరమైన చోట 20 వరకు కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. 

రెండు ప్రాంతాల్లో రహదారి విస్తరణకు అనుకూలంగా ఉండేందుకు సుమారు 2 కిలోమీటర్లు ఎస్సారెస్పీ కాలువలను మార్చనున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పెద్ద, చిన్న వాహనాలు మహబూబాబాద్​ పట్టణంలోకి రాకుండా నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వాహనాల రద్దీ తగ్గి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనున్నది.

ఔటర్​ రింగ్​రోడ్డుకు కనెక్ట్​ కానున్న రోడ్లు..

  •    తాళ్లపూసపల్లి రోడ్డు నుంచి ఎస్సారెస్పీ కాలువ పక్కనుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మీదుగా తొర్రూరు ప్రధాన రోడ్డుకు.
  •    ఇల్లందు రోడ్డులో అనంతారం వెళ్లే స్వాగత తోరణం ఎదురుగా ఉన్న కంకరమిల్లు, డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి నుంచి నర్సంపేట ప్రధాన రహదారిలోని ఏటిగడ్డ తండా సమీపంలో ఈ రోడ్డు కలుస్తుంది.
  •    నర్సంపేట రోడ్డులో  ఏటిగడ్డతండా నుంచి ఎల్​బీజీనగర్, రామబద్రు చెరువు కట్టను కలుపుతూ ఈదులపూసపల్లి రోడ్డుకు.
  •    ఈదులపూసపల్లి రోడ్ లో అంబేద్కర్ కాలనీ పక్కనుంచి గోపాలపురం కాలనీ మిషన్ భగీరథ సంపు నుంచి నిర్మించనున్న ఆర్వోబీని కలుపుతూ యాదవనగర్, వైకుంఠధామం పక్కనుంచి తాళ్లపూసపల్లి రోడ్డుకు ఔటర్​ రింగ్​ రోడ్డు రహదారిని నిర్మించనున్నారు.

సీఎం సానుకూలంగా స్పందించారు..

మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మానుకోట జిల్లా కేంద్రంగా మారిన తరువాత  ట్రాఫిక్ సమస్య బాగా  పెరిగింది. భారీ వాహనాలు సైతం పట్టణం ద్వారా వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. రింగ్ రోడ్డు నిర్మాణం ద్వారా  ట్రాఫిక్ కష్టాలు తొలగిపోవడంతో పాటు ప్రజలు సులభంగా గమ్యం చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్  కోసం నిధుల మంజూరు పై  సీఎం  రేవంత్​ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

డాక్టర్​ భూక్య మురళీ నాయక్, ​మహబూబాబాద్​ ఎమ్మెల్యే