
హైదరాబాద్ లో గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు నిర్మించిన కొత్త ఫ్లై ఓవర్ ను మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26 న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్వెళ్లేవారికి, సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే బస్సులు, వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గనున్నది. అంబర్ పేట మీదుగా అటు ఇటు రాకపోకలు కొనసాగించే వారికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ముఖ్యంగా ఛే నంబర్ శ్రీరమణ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్స్ లేకుండా ప్రయాణించవచ్చు.
చాదర్ ఘాట్ నుంచి సిగ్నల్ తగలకుండా రామాంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ స్ర్టీట్ నెంబర్ 8 వరకు చేరుకోవచ్చు. ముందుగా ప్రధాని మోదీ లేదా కేంద్రమంత్రి గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ప్రారంభిస్తారని అనుకున్నా అది సాధ్యపడలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్న క్రమంలో ఫ్లై ఓవర్‌ను వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. మిగిలిన బ్యూటిఫికేషన్, సర్వీస్ రోడ్డు పనులు పూర్తయ్యాక మళ్లీ గ్రాండ్గాఓపెన్ చేస్తారని తెలుస్తోంది.
సుమారు రూ.445 కోట్లతో 1.625 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో నేషనల్ హైవే అథారిటీ ఈ ఫ్లైఓవర్ నిర్మించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినప్పటికీ భూ సేకరణకు టూ బై థర్డ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. మొత్తంగా రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చు కాగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్లు ఇచ్చింది. ఈ ఫ్లైఓవర్‌కు 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలుపెట్టారు. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పలు కారణాలతో ప్రస్తుతం అందుబాటులోకి రాబోతోంది.