సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కనిస మద్దతు ధర, వ్యవసాయ కూలీలకు పెన్షన్, లంఖీపూర్ ఘటనలో రైతులపై కేసులు ఎత్తివేత, వ్యవసాయ చట్టాల సవరణ వంటి డిమాండ్లతో నిరసన ర్యాలీ ఛలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపట్టారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి రోడ్లపైకి తరలి వస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఘజీపూర్, టిక్రి, సింగు బార్డర్ లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసు బలగాలను పెట్టి ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ఠ భద్రతలు తీసుకున్నారు. ఢిల్లీ చుట్టు పక్కల రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేషనల్ హైవే 44 గుండా సొనిపట్, పానిపట్, కర్నాల్ ప్రాంతాలకు వెళ్లే వెహికల్స్ దారి మళ్లించారు. ఛండీఘర్ లోని మహాత్మ గాంధీ స్టేట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ లో రైతు సంఘాల నేతలతో ఈ రోజు భేటీ కానున్నారు. రైతుల డిమాండ్లు పరిష్కరించి.. పాదయాత్ర విరమింపజేయడానికి పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ ముగ్గురు కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలతో చర్చించనున్నారు. ఇంతకు ముందే ఫిబ్రవరి 8న చర్చలు జరగగా.. ఈరోజు(ఫిబ్రవరి 12)న రెండవ సారి భేటీ అవుతున్నారు.