హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల పరిధిలో ఇవి అమల్లో ఉంటాయని ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి 11గంటల నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు.
ఫ్లై ఓవర్ల మూసివేత
హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరంమాల్, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు బ్రిడ్జ్, బాబు జగ్జీవన్ రామ్, బేగంపేట్, ప్యారడైజ్, నారాయణగూడ, బషీర్ బాగ్, ఎల్బీనగర్, మలక్ పేట్, నెక్లెస్ రోడ్, మెహదీపట్నం, పంజాగుట్ట ప్లైఓవర్లు మూసివేయనున్నారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే పీవీ ఎక్స్ ప్రెస్ వే పైకి అనుమతించనున్నారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 5గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లను అనుమతించరు. కేవలం లారీలు, గూడ్స్ వాహనాలుకు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు.
రైడ్ రద్దు చేస్తే రూ.500 ఫైన్
న్యూ ఇయర్ సందర్భంగా క్యాబ్ డ్రైవర్లకు పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశఆరు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లన్నీ వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రైవర్లు క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 178 ప్రకారం రూ.500 పెనాల్టీ విధిస్తామని ప్రకటించారు. కస్టమర్ల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
హైదరాబాద్ లోని మూడు కమీషనరేట్ల పరిధిలో రేపు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. మద్యం తాగి పట్టుబడిన వారికి మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 185 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమాన విధిస్తామని చెప్పారు.