హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన కోలాహాలం మొదలైంది. నవరాత్రులు పూర్తి కావడంతో గణనాథుడి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో గల్లీలు, రోడ్లు అన్ని వినాయక విగ్రహాలతో బ్యాండ్, డీజే చప్పళ్లు, యువత నృత్యాలతో సందడి నెలకొంది. నిమజ్జనం నేపథ్యంలో రోడ్లన్నీ భారీ టస్కర్లు, డీసీఎంలతో నిండిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.
ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రతో పాటు నగర వ్యాప్తంగా రేపు (సెప్టెంబర్ 17) నిమజ్జనం జరగనుండటంతో హైదరాబాద్‌లో రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు అడిషనల్ ట్రాఫిక్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ విధించినట్లు పేర్కొన్నారు.
బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ప్రధాన శోభయాత్ర ఉంటుందన్న సీపీ.. నిమజ్జన వేడుకలను తిలకించేందుకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌కి వచ్చే భక్తుల కోసం మొత్తం ఎనిమిది చోట్ల పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర మధ్యాహ్నం రెండు గంటల్లోపు పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు తొందరగా విగ్రహాలను తీయాలని సూచన చేశారు. అందరూ రాత్రే విగ్రహాలను తీస్తామంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయన్నారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హెవీ వెహికల్స్‌కి సిటీలోకి అనుమతి లేదని.. నగర శివార్లలోనే ఉండాలని ఆదేశించారు.