అందెవెల్లి పెద్దవాగుపై .. కొట్టుకుపోయిన టెంపరరీ బ్రిడ్జి

అందెవెల్లి పెద్దవాగుపై .. కొట్టుకుపోయిన టెంపరరీ బ్రిడ్జి
  • 50 గ్రామాలకు నిలిచిన రాకపోకలు 
  • సమస్య పరిష్కరించకపోతే నిరవధిక దీక్ష చేస్తానన్న ఎమ్మెల్యే హరీశ్ బాబు  
  • సీఎంకు బహిరంగ లేఖ  సోమవారం ఉదయం 
  • 9 గంటల వరకు డెడ్​లైన్​ 

కాగజ్​నగర్, వెలుగు : కొమ్రం భీం ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ మండలం అందెవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన, రోడ్డు  కొట్టుకుపోయాయి. దీంతో కాగజ్‌‌నగర్‌‌ నుంచి దహెగాం మండలంలోని సుమారు 50 గ్రామాలకు రాకపోక లు నిలిచిపొయాయి. రెండేండ్ల కింద అందవెల్లి బ్రిడ్జిలోని మూడు పిల్లర్లు కుంగిపోయి ఆ తర్వాత మొత్తానికి కూలిపోయాయి. దీంతో బ్రిడ్జికి రిపేర్లు చేస్తున్నారు. దీంతో గత ఏడాది నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుంచే కాగజ్‌‌నగర్‌‌, దహెగాం గ్రామాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో తాత్కాలిక బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. రిపేర్లు నడుస్తున్న బ్రిడ్జి పనుల్లో ప్రధానమైన స్లాబ్ లు, పిల్లర్ల నిర్మాణం పూర్తయినా అప్రోచ్ రోడ్డు కంప్లీట్​ కాకపోవడంతో రాకపోకలు సాగించే అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్రిడ్జి చివరన కట్టిన గోడకు నిచ్చెన వేసుకొని ఎక్కి దానిమీద నుంచి నడిచి వెళ్తున్నారు. 

కాంట్రాక్టర్​కు ఆర్అండ్​బీ నుంచి నిధులు రాకపోవడంతోనే పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.బ్రిడ్జి మీదనే నిరవధిక దీక్ష చేస్తాతన నియోజకవర్గంలోని బ్రిడ్జి నిర్మించి ప్రజల ఇబ్బంది తీర్చాలని ప్రభుత్వాన్ని, మంత్రిని కోరినా పట్టించుకోలేదని, నిధులు ఇవ్వకపోవడంతో సమస్య వచ్చిందని, 24 గంటల్లో సమస్య పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు హెచ్చరించారు.

అందవెల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి, వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును పరిశీలించారు. అక్కడే సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటల్లోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తిచేయకపోతే బ్రిడ్జిపై నిరవధిక దీక్ష చేపడతానని వెల్లడించారు. నెల రోజులుగా ఇన్​చార్జి మంత్రి సీతక్కకు బ్రిడ్జి గురించి అనేక సార్లు తెలియజేశానని, అయినా సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు సత్యనారాయణ ఉన్నారు.