పట్నం బాట పట్టిన జనం..విజయవాడ–హైదరాబాద్ హైవేపై పెరిగిన ట్రాఫిక్‌‌

పట్నం బాట పట్టిన జనం..విజయవాడ–హైదరాబాద్ హైవేపై పెరిగిన ట్రాఫిక్‌‌

నల్గొండ/యాదాద్రి, వెలుగు : సంక్రాంతి పండుగ కోసం గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు. ఏపీ నుంచి వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్‌‌ వైపు వస్తుండడంతో విజయవాడ– -హైదరాబాద్ హైవేపై, టోల్‌‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌‌ మండలం పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద హైదరాబాద్‌‌ వైపు 10 బూత్‎లను, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌‌ టోల్‌‌ప్లాజా వద్ద 8 బూత్‌‌లను ఓపెన్ చేశారు. ప్రమాదాలు, ట్రాఫిక్‌‌ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌‌ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్‌‌ నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న రైల్వే అండర్‌‌ పాస్‌‌ బ్రిడ్జి వద్ద ఇరుక్కుపోవడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌ నిలిచిపోయింది. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి, కంటైయినర్‌‌ టైర్లలో గాలి తీసి ముందుకు కదిలించిన అనంతరం ట్రాఫిక్‌‌ను క్లియర్‌‌ చేశారు.