- జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు
- నివారించేందుకు నిత్యం ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
- మూడు నెలల్లోనే రూ. 2.39 కోట్ల జరిమాన
యాదాద్రి, వెలుగు : జిల్లాలో ట్రాఫిక్ పై పోలీసులు నిత్యం చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్లేకుండా కొందరు, లైసెన్స్ లేకుండా మరికొందరు యథేచ్చగా వాహనాలను నడుపుతూ పోలీసులకు దొరుకుతున్నారు. జిల్లాలో వివిధ కారణాలతో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన ఘటనల్లో 90 వేల కేసులను నమోదు చేశారు. కేవలం 3 నెలల్లోనే ఇన్ని కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు రూ.2.39 కోట్ల జరిమానాలను పోలీసులు వాహనదారులకు విధించారు.
నిత్యం తనిఖీలు
యాదాద్రి జిల్లాలో భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పంతంగి, గూడూరు టోల్ ఫ్లాజా, రాయగిరి, వంగపల్లి సహా పలు ప్రాంతాల్లో నిత్యం వాహనాల తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్ లేకుండా వెహికిల్ నడిపిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్‌పై కొందరి ప్రయాణాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా సెల్‌ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు.
కొందరు రెండుమూడు మార్లు పోలీసులకు చిక్కిన సంఘటనలూ ఉన్నాయి. అయినా మార్పు రావడం లేదు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉండడం వల్ల మళ్లీ అదే విధంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఒకే వాహనంపై ముగ్గురు అతి వేగంగా వెళ్లడం తరచూ జరుగుతున్నాయి. రాంగ్ రూట్లో నడపడంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా మార్పు రావడం లేదు.
90,173 కేసులు..
జిల్లాలోని మూడు పీఎస్‌ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 31 వరకూ జరిగిన తనిఖీల్లో 90173 కేసులు నమోదయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించినందున వారికి రూ. 2,39,53,100 జరిమానా విధించారు. ఇందులో హెల్మెట్ లేకుండా ప్రయాణించిన కేసులే 61,857 కేసులు ఉన్నాయి.