
ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్‌సాగు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు పామాయిల్ నర్సరీల నుంచి మొక్కలు పక్కదారి పడుతున్నాయి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సీరియల్ ప్రకారం పంపిణీ చేయాల్సిన మొక్కలను కొందరు కిందిస్థాయి ఆయిల్ ఫెడ్ సిబ్బంది దళారులతో కలిసి అమ్మేస్తున్నారు. ఒక్కో మొక్క రూ.20 చొప్పున రైతులకు ఇవ్వాల్సి ఉండగా వాటిని రూ.500 చొప్పున గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా మొక్కలు అందుబాటులో లేకపోవడం, ఎక్కువకాలం వెయిటింగ్ పీరియడ్ ఉంటుండడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన నర్సరీల నుంచి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా మొక్కలు తరలివెళ్తున్నాయి. రెండు నెలల క్రితం జనగామ జిల్లాలోని నర్సరీ నుంచి ఏపీలోని ఏలూరు జిల్లాకు ట్రాక్టర్లో తరలించిన 600 మొక్కలను రికవరీ చేశారు. రెండు రోజుల క్రితం పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల నర్సరీ నుంచి మూడు వెహికల్స్‌లో మొక్కలు తరలించే ప్రయత్నం చేస్తుండగా, ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కొందరు పరారీలో ఉన్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.
మొక్కలకు మస్తు డిమాండ్..
ఆయిల్ పామ్ మొక్కలను నేరుగా విత్తడం, సీడ్ డెవలప్ చేయడం కానీ మన దేశంలో సాధ్యం కాదు. ప్రస్తుతం ఇండోనేషియా, థాయ్ లాండ్, మలేషియా లాంటి దేశాల నుంచి నారు దిగుమతి చేసుకొని, మన దగ్గర నర్సరీల్లో ఏడాది పాటు పెంచిన తర్వాత రైతులకు పంపిణీ చేస్తున్నారు. అనుకున్న వెంటనే సాగు చేసుకునే అవకాశం లేకపోవడం మొక్కల అక్రమ రవాణాకు కారణమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్‌సాగు చేస్తున్నారు. 2022–-23 ఆర్థిక సంవత్సరానికి 24 వేల ఎకరాలకు మొక్కలను అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 14 వేల ఎకరాలకు అందజేశారు. మార్చి 31లోగా ఉమ్మడి జిల్లాలో ఇంకా 5 వేల మంది రైతులకు 5.70 లక్షల మొక్కలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అశ్వారావుపేట, రేగళ్లపాడు, కుప్పెనకుంట్ల నర్సరీల్లో కలిపి 6.70 లక్షల మొక్కలు ఈ ఏడాది అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రేగళ్లపాడులో 4.60 లక్షల మొక్కలు, అశ్వారావుపేటలో 6.80 లక్షలు, అప్పారావుపేటలో 2 లక్షల మొక్కలు సిద్ధమవుతున్నాయని అంటున్నారు. ఆయిల్ పామ్ ఎకరానికి 57 మొక్కలు సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నా, అక్కడి రైతులకు డిమాండ్‌కు తగిన సంఖ్యలో నర్సరీలు, మొక్కలు అందుబాటులో లేవు. ఇదే అవకాశంగా కొందరు ఆయిల్ ఫెడ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ మొక్కలను అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. వరుస ఫిర్యాదులు, విమర్శల నేపథ్యంలో మొక్కల అక్రమరవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అన్ని నర్సరీల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సిబ్బంది ప్రమేయం ఉందని తెలితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆఫీసర్లు వార్నింగ్ ఇస్తున్నారు.
అక్రమ రవాణా ఘటనలు
పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల నర్సరీ నుంచి ఈనెల 2న అర్ధరాత్రి సమయంలో పామాయిల్ మొక్కలను దొంగతనం చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. మొక్కలు తరలించేందుకు తీసుకువచ్చిన టిప్పర్, రెండు మినీ వ్యాన్ లను పోలీసులు గుర్తించారు. దొంగతనం ప్లాన్ వెనుక సిబ్బంది హస్తం కూడా ఉండొచ్చంటూ పెనుబల్లి పోలీసులకు ఆయిల్ ఫెడ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ రెండో వారంలో సత్తుపల్లి మీదుగా ఏపీ వైపు ట్రాక్టర్ లో మొక్కలు అక్రమంగా తరలించడాన్ని గుర్తించిన కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఏలూరు జిల్లా పోతునూరులోని ఒక పామాయిల్ తోటలో ఉంచిన 600 మొక్కలను రికవరీ చేసి తీసుకువచ్చారు. ఎంక్వైరీలో జనగామ జిల్లాలోని నర్సరీ నుంచి ఈ మొక్కలను తరలించారని గుర్తించారు. ఇద్దరు నర్సరీ ఇన్చార్జిలను డ్యూటీ నుంచి తొలగించారు. గతేడాది అశ్వారావుపేటలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒక రైతుకు మంజూరయిన మొక్కలను, మరో రైతు పొలంలో సాగు చేశారు. దీన్ని గుర్తించిన ఆఫీసర్లు వేర్వేరుగా రెండు కేసులు పెట్టారు.
దొంగతనంగా కొంటే రైతుకే నష్టం
రైతులు ఎవరైనా పామాయిల్ మొక్కలను బ్రోకర్ల ద్వారా దొంగతనంగా కొనుగోలు చేసి సాగు చేస్తే వారికే నష్టం. ప్రభుత్వం నుంచి డ్రిప్కుగానీ, మొక్కలకు గానీ వారికి ఎలాంటి సబ్సిడీ అందదు. రైతులు కంపెనీ దగ్గర రిజిస్టర్అయి ఉండకపోతే వారి గెలలను కొనరు. ఇక మొక్కల అక్రమ రవాణాలో సిబ్బంది ప్రమేయం ఉందని తేలితే వారిని డ్యూటీ నుంచి తొలగిస్తాం. అన్ని నర్సరీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. సెక్యూరిటీ సిబ్బందిని కూడా రొటేషన్పద్ధతిలో మారుస్తున్నాం. - ఆకుల బాలకృష్ణ, డివిజనల్ ఆఫీసర్, టీఎస్ ఆయిల్ ఫెడ్