మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. గర్బిణీకి డెలివరీ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసికందు చేతి విరిగిపోయింది. మెడ దగ్గర కొన్ని గాయాలు అయ్యాయి. ప్రసవం తర్వాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో జరిగింది.
చొప్పదండికి చెందిన శ్వేత ప్రసవం కోసం కరీంనగర్ మాతాశిశు ఆసుపత్రిలో మే 01న (సోమవారం) చేరింది. సాధారణ ప్రసవంతో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత బాలుడు చనిపోయాడనే విషయాన్ని వైద్యులు శ్వేత కుటుంబీకులకు తెలియజేశారు. అయితే శిశువును ఎత్తుకున్న కుటుంబ సభ్యులు.. బాలుడి చేయి, మెడ దగ్గర గాయాలను గమనించారు. దీంతో కాన్పు చేసేటప్పుడు వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందని శ్వేత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పసికందు మృతదేహంతో ఆసుపత్రి గేటు ముందు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.