బోయిన్ పల్లిలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

బోయిన్ పల్లిలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్ : బోయిన్ పల్లి భవానీనగర్ లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. తండ్రి చనిపోయాడనే బాధతో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారిలో తల్లి విజయలక్ష్మీ, కూతుళ్లు చంద్రకళ, సౌజన్య ఉన్నారు. 

అసలేం జరిగిందంటే..? 

2023, ఏప్రిల్ 4వ తేదీన అనారోగ్యంతో సూర్యనారాయణ (ఇంటి పెద్ద) చనిపోయారు. ఈయన ప్రైవేటు ఉద్యోగి. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడంతో సూర్యనారాయణ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. సూర్యనారాయణ దశదిన కర్మ తర్వాత ఏప్రిల్ 16న ఆయన భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు చంద్రకళ, సౌజన్య ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇది గమనించిన స్థానికులు, బంధువులు వారిని కాపాడారు. 

కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్న సూర్యనారాయణ భార్య, ఇద్దరు కూతుళ్లు సోమవారం (జూన్ 12న) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు సూర్యనారాయణ భార్య విజయలక్ష్మీ సూసైడ్ లెటర్ రాశారు. తమకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని, తన భర్త సూర్యనారాయణ చనిపోయిన కారణంగానే తాము తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లో పేర్కొన్నారు. 

తల్లి విజయ లక్ష్మీ, ఎంబీఏ చదువుతున్న కూతురు చంద్రకళ, వికలాంగురాలైన కూతురు సౌజన్య.. ముగ్గురు ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం బయటకు రాకుండా బోయిన్ పల్లి పోలీసులు, బంధువులు గోప్యంగా ఉంచారు. ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత సొంతూరు ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరికి తీసుకెళ్తారని బంధువులు చెబుతున్నారు.