గ్రేటర్ హైదరాబాద్ లో ఓ మహిళ హత్య సంచలనం రేపుతోంది. అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు సంఘటనా స్థలంలో కనిపించిన డెడ్ బాడీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును చేధించడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది.
పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఓ నిర్మాణ సంస్థలో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతురాలు గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళగా గుర్తించారు.
మృతురాలు.. వేస్ట్ మెటీరియల్ సేకరించేందుకు శుక్రవారం (ఆగస్టు 25వ తేదీ) ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని నిర్మాణ సంస్థకు వెళ్లింది. అక్కడే దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత బండరాయితో మోదీ చంపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే రోజు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మహిళ మిస్సింగ్ కేసు నమోదైంది.
దర్యాప్తు వేగవంతం
మృతురాలి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మహిళ హత్యపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.
క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్లూస్ టీమ్ సభ్యులు పలు ఆధారాలు సేకరించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. భవన నిర్మాణ కార్మికులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 27వ తేదీ) 10 మందితో ఉన్న కూలీల బ్యాచ్ బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కూలీలను విచారించారు.
మరోవైపు.. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ కేసును త్వరగా పరిష్కరించి.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారు.