చెన్నై: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) స్పెషల్ కోచింగ్ బ్యాచ్‌కు తనను సెలెక్ట్ చేయలేదని 18 ఏండ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి ప్రాణం తీసుకుంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అబతరణపురానికి చెందిన నిషా.. నీట్‌కోసం నైవేలిలోని బైజుస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే క్లాస్‌కు వెళ్తున్నానని ఇంట్లోవాళ్లకు చెప్పి బయల్దేరిన ఆ యువతిని.. కోచింగ్ సెంటర్ వాళ్లు స్పెషల్ బ్యాచ్‌లో కూర్చునేందుకు అనుమతివ్వలేదు. దీంతో మనస్థాపం చెందిన నిషా.. వడలూరు స్టేషన్‌కు చేరుకుని రైలు కింద దూకింది. ఆమెను గమనించి లోకో పైలట్ రైలును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రైల్వే పోలీసులు డెడ్‌బాడీని పోస్టుమార్టానికి తరలించారు.
బైజుస్ కోచింగ్ సెంటరే కారణం: నిషా తండ్రి
తన కూతురి ఆత్మహత్యకు బైజుస్ కోచింగ్ సెంటరే కారణమని నిషా తండ్రి ఉతిరభారతి ఆరోపించారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్టూడెంట్లను బ్యాచ్‌లుగా వేరు చేయడంతో నిషా మనస్థాపం చెందిందని తెలిపారు. ‘‘నిషాకు 399 మార్కులు వచ్చాయి. కానీ, 400 కంటే ఎక్కువ మార్కులు వచ్చినోళ్లకు మాత్రమే బైజుస్ వాళ్లు స్పెషల్ కోచింగ్ ఇస్తున్నారు. ఇదే ఆమె డిప్రెషన్‌కు కారణమైంది” అని ఉతిర భారతి చెప్పారు. కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.