బెంగళూరులో టెకీ ఫ్యామిలీ సూసైడ్..కారణం అదేనా?

బెంగళూరులో టెకీ ఫ్యామిలీ సూసైడ్..కారణం అదేనా?
  • ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి..ఉరేసుకున్న దంపతులు
  • కూతురి అనారోగ్యమే కారణం!
  • దర్యాప్తు జరుపుతున్న పోలీసులు

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి చంపిన దంపతులు ఆపై ఉరివేసుకున్నారు.ఉత్తరప్రదేశ్‌‌లోని ప్రయాగ్‌‌రాజ్‌‌కు చెందిన అనూప్‌‌ కుమార్‌‌(38) సాఫ్ట్‌‌వేర్  కన్సల్టెంట్‌‌గా వర్క్ చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్య రాఖీ (35), కూతురు అనుప్రియ(5)  కొడుకు ప్రియాంష్‌‌ (2) తో కలిసి  బెంగళూరులో నివసిస్తున్నాడు. 

అనూప్‌‌ ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌‌వేర్‌‌ కన్సల్టెంట్‌‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం ఉదయం పనిమనిషి వచ్చి తలుపుతట్టగా అనూప్‌‌ దంపతులు ఎంతకూ డోర్  తీయలేదు. దాంతో ఆమె పక్కింటివారికి సమాచారం ఇచ్చింది. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అనూప్‌‌ ఇంటికి చేరుకుని..తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో  అనూప్‌‌, అతని భార్య రాఖీతోపాటు ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. పిల్లలిద్దరి డెడ్ బాడీలు బెడ్‌‌పై పడివుండగా.. అనూప్‌‌, రాఖీ డెడ్ బాడీలు ఫ్యాన్‌‌కు వేలాడుతూ కనిపించాయి. 

అనూప్‌‌ దంపతులు పిల్లలిద్దరికి విషమిచ్చి చంపి.. ఆ తర్వాత వాళ్లు ఉరేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అనూప్‌‌ ఇంట్లో మొత్తం ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు వంట మనుషులు కాగా, ఒకరు పిల్లల కేర్‌‌టేకర్‌‌గా పనిచేస్తున్నారు. అనూప్ దంపతులకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. అయితే, కూతురు అనుప్రియ ఆరోగ్యం గురించే దంపతులు ఎప్పుడూ ఆందోళన చెందుతుండేవారని పనిమనిషి చెప్పిందన్నారు. 

ఆ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. సోమవారం అనూప్‌‌ దంపతులు పుదుచ్చేరి టూర్ ప్లాన్‌‌ చేసుకున్నారని.. ఆదివారం రాత్రి లగేజ్‌‌ను కూడా సర్దిపెట్టుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరి రాత్రికి రాత్రి ఏంజరిగింది, అనూప్‌‌ దంపతులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేది తెలీడం లేదన్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.