కూతురిని ప్రేమించాడని  యువకుడి తల్లిదండ్రులకు నిప్పు

కూతురిని ప్రేమించాడని  యువకుడి తల్లిదండ్రులకు నిప్పు

అల్వాల్, వెలుగు : హైదరాబాద్​లోని​ అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. తన అన్న కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో అమ్మాయి బాబాయ్, పిన్ని, మరొకరు ..యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్​పోసి నిప్పంటించారు.  50 శాతం శరీరం కాలడంతో యువకుడి తండ్రి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం..అల్వాల్​మచ్చబొల్లారం గోపాల్​నగర్​ఎరుకల బస్తీలో ఉండే ప్రకాశ్​ (45) కూలీ. ప్రకాశ్​కొడుకు ప్రదీప్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై గతంలో చాలా సార్లు గొడవలు జరిగాయి. దీంతో ప్రదీప్​పై అమ్మాయి బాబాయ్​నందకుమార్, పిన్ని లక్ష్మి, నందకుమార్​తల్లి  కక్ష పెంచుకున్నారు.

ఆగ్రహంతో మంగళవారం రాత్రి పెట్రోల్​బాటిల్​తో ప్రదీప్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ప్రదీప్ లేకపోవడంతో ఆయన​తండ్రి ప్రకాశ్, తల్లి హేమలతపై పెట్రోల్​పోసి నిప్పంటించి, అక్కడి నుంచి పరారయ్యారు. ప్రకాశ్​ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో హేమలతతోపాటు పక్కనే ఉన్న నాలుగేండ్ల చిన్నారి స్వల్పంగా గాయపడింది. ఈ పాప పక్కింట్లో ఉంటూ ప్రదీప్​ఇంటికి ఆడుకోవడానికి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్​ను గాంధీ దవాఖానకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.