బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో ఏడు ఏనుగులు మృతి

 బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో ఏడు ఏనుగులు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లోని ఏడు ఏనుగులు మృతి చెందగా.. మరో మూడు ఏనుగులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఏనుగుల మృతికి కారణం ఏంటన్నది ప్రస్తుతం తెలియదని అధికారులు పేర్కొన్నారు. స్థానిక రైతులు పంటలపై పురుగుమందులు పిచికారీ చేశారని, అది మరణాలకు కారణమై ఉంటుందని అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నందకిషోర్ కాలేతో సహా సీనియర్ వన్యప్రాణి అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఏనుగులను పోస్ట్ మార్టం నిమిత్తం జబల్‌పూర్ స్కూల్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్స్ అండ్ హెల్త్‌ ల్యాబ్‎కు తరలించారు.

ALSO READ | ఆలయ ఉత్సవంలో మంటలు.. కేరళలో 150 మందికి గాయాలు

ఏనుగుల మృతిపై దర్యాప్తుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, గతంలో కూడా పెద్ద పులుల మరణాలతో బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 47 పెద్ద పులులు మరణించడంతో బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌ నిర్వహణ అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఏనుగుల మృతితో మరోసారి బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌ వార్తల్లోకెక్కింది.