
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పట్టణంలోని పోకల బజార్లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్థానికల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.
కాగా, ప్రమాదానికి గురైన భవనం అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. జీ ప్లస్ టూకు మాత్రమే పర్మిషన్ ఉండగా.. అంతకుమించి ఎత్తున నిర్మాణం చేపడుతుండటంతో గతంలోనే ఈవో భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. అధికారులు అనుమతి నిరాకరించినప్పటికీ.. అలాగే పనులు కంటిన్యూ చేస్తున్నారు ఇంటి యజమానులు. ఈ క్రమంలోనే బుధవారం (మార్చి 26) గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లర్లు సరి చేస్తుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలింది.
దీంతో కార్మికులు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవిన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సహయక చర్యల కోసం ఐటీసీ నుంచి ప్రొక్లెయిన్లు, క్రేన్లను రప్పించారు. నిర్మాణంలో లోపం వల్లే భవనల నేలమట్టం అయిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | నడి బజారులో న్యాయవాదులను నరికి చంపితే ఇప్పటికీ శిక్షలు పడలే: బీఆర్ఎస్పై CM రేవంత్ ఫైర్