కామారెడ్డి: సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. గజ ఈతగాళ్ల సహాయంతో రెండు మృత దేహాలు వెలికితీశారు. మరో మృత దేహం కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయి కుమార్ కోసం వెతుకులాట సాగిస్తున్నారు.
సాయికుమార్ భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. శృతి బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్‌గా నిఖిల్ పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురూ ఒకే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఈ ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
బుధవారం సాయంత్రం నుంచి ఈ ముగ్గురూ కనిపించకుండా పోయారు. ఎస్సై మిస్సింగ్‌పై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్‌ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు సమీపంలో టవర్లొకేషన్ ఆగిపోయినట్టు గుర్తించారు. చెరువు కట్ట సమీపంలో ఎస్సై సొంత కారును గుర్తించారు.
చెరువు గట్టున ఇద్దరు పురుషుల చెప్పులు ఉన్నట్టు కనుగొన్నారు. వీరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని, గజ ఈతగాళ్లతో చెరువులో అర్ధరాత్రి వరకు గాలించారు. మహిళా కానిస్టేబుల్‌తో పాటు నిఖిల్ డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఎస్ఐ ఆచూకీ లభించలేదు. వీరందరూ సూసైడ్ చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.