ప్రగతినగర్లో విషాదం.. స్ప్రింగ్ బెడ్పై నిద్రిస్తున్న ఏడేళ్ల పిల్లాడు సజీవ దహనం

ప్రగతినగర్లో విషాదం.. స్ప్రింగ్ బెడ్పై నిద్రిస్తున్న ఏడేళ్ల పిల్లాడు సజీవ దహనం

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలుడు కరెంట్ షాక్ కారణంగా మృతి చెందాడు. ఈ ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు స్ప్రింగ్ బెడ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి.

మంటల్లో ఏడేళ్ల బాలుడు అనురాజన్ అక్కడిక్కడే సజీవ దహనమయ్యాడు. స్ప్రింగ్ బెడ్పై నిద్రిస్తున్న అనురాజన్పై విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తు తెగి పడడంతో విద్యుతాఘాతమై తీవ్ర గాయాలై శరీరం కాలడంతో బాలుడు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ప్రగతి నగర్ కాలనీకి చెందిన బంధువు ఒకరు చనిపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు పిల్లాడిని ఒక్కడినే ఇంట్లో వదిలి అక్కడికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారంతో ఇచ్చారు. అక్కడికి వచ్చి చూడగా బాలుడు అప్పటికే మృతి చెందాడు. 

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికంగా ఈ ఘటన అందరినీ కలచివేసింది. ప్రగతి నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.