
- ఆడుకుంటూ కారెక్కిన పిల్లలు
- గమనించని కుటుంబ సభ్యులు
చేవెళ్ల, వెలుగు: కారు డోర్లు లాక్ కావడంతో ఇద్దరు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో చోటు చేసుకున్నది. చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్, జ్యోతి దంపతుల చిన్న కూతురు తన్మయి శ్రీ(5). షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహేందర్, ఉమారాణి దంపతుల చిన్న కూతురు అభినయశ్రీ(4). ఈ నెల 30న చిన్నారుల మేనమామ రాంబాబు పెండ్లి ఉండడంతో దామరగిద్దకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు పార్క్ చేసిన రాంబాబు కారులో కూర్చున్నారు.
బయటికొచ్చేందుకు ప్రయత్నించగా డోర్లు లాక్ అయిపోయాయి. చిన్నారులు కారెక్కిన విషయం కుటుంబ సభ్యులు గమనించలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్నారని అందరూ భావించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో చిన్నారుల కోసం వెతికారు. కారులో చూడగా ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. లాక్ తీసి చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు.. చిన్నారులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు.
దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, పామెన గ్రామానికి చెందిన కావాలి వెంకటేశ్‌కు ముగ్గురూ ఆడపిల్లలే. కారు ప్రమాదంలో చిన్న కూతురు తన్మయిశ్రీ చనిపోయింది. వెంకటేశ్ కార్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అలాగే, సీతారాంపురం గ్రామానికి చెందిన మహేందర్ కు బాబు, పాప అభినయశ్రీ ఉన్నారు. కారు ప్రమాదంలో అభినయశ్రీ చనిపోయింది.