రిపబ్లిక్​ డే ఏర్పాట్లలో విషాదం కరెంట్​ షాక్​తో.. ఇద్దరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

  •     జెండా కోసం నిలబెడుతుండగా11 కేవీ లైన్​కు తాకిన పోల్​ 
  •     మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా

ములుగు, వెలుగు : ములుగులో కొందరు యువకులు రిపబ్లిక్​ డే ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేసుకుంటుండగా  విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండా ఆవిష్కరించేందుకు ఎస్సీ కాలనీకి చెందిన యువకులు జెండా పైపును అమరుస్తున్న  క్రమంలో 11కేవీ విద్యుత్​ తీగలు తగిలి ముగ్గురికి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ములుగులోని శివాలయం ఎదురుగా ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన బోడ ఏలేంద్ర-, కొమురయ్య దంపతుల కొడుకు బోడ అంజిత్​ కుమార్​(28) సెంట్రింగ్, కూలీ పనులు చేస్తుంటాడు. ఈయనకు భార్య లావణ్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అలాగే ల్యాడ లక్ష్మీ-శంకర్ ​కొడుకు ల్యాడ విజయ్​(25) కూలీ. శుక్రవారం రిపబ్లిక్​ డే సందర్భంగా స్థానిక యువకులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల ప్రాంతంలో అంజిత్​కుమార్, ల్యాడ విజయ్​, బోడ కల్యాణ్​ తోపాటు మరికొందరు జెండా కోసం ఇనుప పైపును నిలబెట్టే పనుల్లో ఉన్నారు. జెండా గద్దెపై నుంచే 11కేవీ  విద్యుత్ ​లైన్ ​వెళ్తోంది. దీన్ని గమనించని యువకులు పైపును పైకెత్తి జెండా గద్దెలో వేసేందుకు ప్రయత్నించగా తీగలకు తగిలింది. దీంతో షాక్​కొట్టి అంజిత్, విజయ్​, కల్యాణ్ ​తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అంజిత్, విజయ్​ చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మృతుల కుటుంబసభ్యులకు మంత్రి పరామర్శ

యువకులు చనిపోయిన విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.10వేలను ఇచ్చిన సీతక్క...ఒక్కోకుటుంబానికి రూ.5లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. కల్యాణ్​కు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. 

ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసపత్రం అందుకున్న 2 గంటల్లోనే హఠాన్మరణం

ఆదిలాబాద్​టౌన్ :  ఆదిలాబాద్​ మున్సిపల్​ ఆఫీసులో మేనేజర్​గా పని చేస్తున్న దివాకర్​ ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్న రెండు గంటల్లోనే హఠాన్మరణం చెందారు. శుక్రవారం రిపబ్లిక్​ డే వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్​రాజ్ నుంచి ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసపత్రం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ప్రైవేట్​దవాఖానకు తరలించారు. అప్పటికే దివాకర్ గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.