
దుర్గమ్మ పండుగలో విషాదం నెలకొంది. పండుగ సంబురంలో మునిగిన ఆ తండాలో ఒక్కసారిగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో సోమవారం సాయంత్రం విద్యుత్ వైర్లు తెగిపడి తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మోత్యతండాకు చెందిన భూక్య రవి , రాయపర్తి మండలం గట్టికల్లు శివారు జగన్నాథపల్లి కొత్త తండాకు చెందిన గుగులోతు దేవేందర్ , తొర్రూరు మండలం జమస్తాన్‌పురం గ్రామం సుందర్‌నాయక్‌తండాకు చెందిన బానోతు సునీల్ మృతి చెందారు.
తండాలో దుర్గామాత ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. టెంట్‌హౌజ్ సామగ్రిని భూక్య రవి ఇంటి వద్దకు చేర్చుతున్న క్రమంలో విద్యుత్ వైర్లు అకస్మాత్తుగా తెగిపడి అక్కడే ఉన్న దేవేందర్, సునీల్, రవి, అతడి కుమారుడు జశ్వంత్ విద్యుత్ షాక్కు గురయ్యారు. దేవేందర్, సునీల్ అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దవాఖానకు తీసుకెళ్తుండగా రవి మార్గమధ్యలో చనిపోయాడు.
రవి కొడుకు నాలుగేళ్ల చిన్నారి జశ్వంత్ తీవ్ర గాయాలతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురి మృతితో తండాలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓవర్ లోడ్‌తో తీగలు తెగి పడ్డాయని, గతంలో ఓవర్‌లోడ్ విషయమై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు.