
- భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దారుణం
రేగొండ, వెలుగు : కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి, ఇందుకు అడ్డుగా ఉన్నాడని కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రేపాకపల్లికి చెందిన కాసం ఓదేలు (35) 108 డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి 14 ఏండ్ల కింద పరకాల మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన దేవితో పెండ్లి జరిగింది.
ఈ క్రమంలో ఓదేలు తండ్రి మొండయ్య, దేవి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా మొండయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం ఓదెలు పెండ్లి రోజు కావడంతో రాత్రి ఇంట్లో కేక్ కట్ చేస్తుండగా తండ్రీకొడుకుల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో స్థానికులు నచ్చజెప్పగా గొడవ సద్దుమణిగింది.
ఈ క్రమంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును హత్య చేయాలని మొండయ్య నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా రాత్రి ఆరు బయట పడుకున్న ఓదేలు తలపై రోకలి బండతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత మొండయ్య జిల్లా కేంద్రానికి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా సమాచారం. ఓదేలు భార్య దేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.