
జనగామ: శ్రీరామ నవమి రోజున విషాదం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం రామాలయం దగ్గర గాలి దుమారం బీభత్సం రేపింది. ఆలయం దగ్గర వేసిన టెంట్లు కుప్పకూలాయి. భక్తులకు ఏర్పాటు చేసిన భోజన టెంట్లు కూలి భక్తులకు గాయాలయ్యాయి. ముగ్గురు భక్తులకు తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా భక్తులపై టెంట్లు కూలడంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏర్పాటు చేసిన ఈ భోజనాలన్నీ నేల పాలయ్యాయి.
ఇదిలా ఉండగా.. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ నవమి పండగ రోజున కుల వివక్ష ఘటన వెలుగుచూసింది. ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో శ్రీరామ నవమి కుంకుమర్చాన పూజలకు మహిళలను గుడిలోకి పూజారి అనుమతించలేదు. గౌడ కుల మహిళలను రామాలయంలోకి రావద్దని గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిందని పూజారి చెప్పాడు. చేసేదేమి లేక గుడి నుంచి గౌడ మహిళలు బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో గౌడ కులస్తులు, మహిళలు ఫిర్యాదు చేశారు.