హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ని దుండగులు హత్య చేశారు. అనంతరం సెలూన్ లోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, పారిపోయారు. పాపారాయుడు నగర్లో ఈ ఘటన కలకలం రేపింది.
రాత్రి అయినా అశోక్ ఇంటికి వెళ్లకపోవడంతో ఆయన భార్య, పిల్లలు కంగారు పడ్డారు. తెలిసిన వాళ్లను వాకబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో నేరుగా హర్ష లుక్స్ సెలూన్ కు వెళ్లారు. షాపులో రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి ఆయన భార్య షాక్ కు గురయ్యారు. విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి పిల్లలు బోరున విలపించారు.
విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అశోక్ దగ్గర పని చేసిన యువకుడే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.