- గొంతుకోసి యువకుడి దారుణ హత్య
- మైలార్ దేవ్ పల్లిలో ఘటన
శంషాబాద్, వెలుగు : గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్ పాశ్వాన్ తన భార్య, కుమారుడు రాజా పాశ్వాన్ (17) తో కలిసి మైలార్ దేవ్ పల్లి లక్ష్మీ గూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజా పాశ్వాన్ కాటేదాన్ పారిశ్రామిక వాడలోని స్క్రాప్ కంపెనీలో పని చేస్తున్నాడు.
ఈ నెల 26 సాయంత్రం కంపెనీ దగ్గర డబ్బులు తెచ్చుకుంటానని ఇంటి నుంచి తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తండ్రి సంజయ్ కంపెనీకి వెళ్లి ఆరా తీయగా డబ్బుల కోసం కంపెనీకి రాలేదని యాజమాన్యం తెలిపింది. చుట్టు పక్కల రాత్రి వరకు గాలించిన రాజా పాశ్వాన్ జాడ దొరకలేదు. ఆదివారం లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో రాజా పాశ్వాన్‌ను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా గొంతు కోసి చంపి పడేశారు.
సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ గంగాధర్, సీఐ మధు పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపిన పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాలనీలో మర్డర్ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.