- గోదావరిఖనిలో కుక్కను తప్పించబోయి లారీని ఢీకొట్టిన కారు
- 11 నెలల కొడుకుతో సహా తండ్రి మృతి, మరో ముగ్గురికి గాయాలు
- బాల్కొండ మండలంలో బైక్‌ను ఢీకొట్టిన కంటెయినర్, వ్యక్తి మృతి
గోదావరిఖని, వెలుగు : కుక్కను తప్పించబోయే క్రమంలో కారు.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టడంతో తండ్రీకొడుకు చనిపోగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం గోదావరిఖని గాంధీనగర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖనిలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన, సింగరేణి జీడీకే 11వ గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడిగా పనిచేస్తున్న గిన్నారపు సతీశ్ (33) తన భార్య కీర్తి, కుమారుడు నవీశ్ (11 నెలలు), సోదరి అనూష, బావ ఆతుకూరి సతీశ్‌తో కలిసి ఆదివారం కారులో హైదరాబాద్ వెళ్లారు.
రాత్రి తిరిగి వస్తూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల టైంలో గోదావరిఖనిలోని గాంధీనగర్ వద్దకు రాగానే కారుకు కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారును ఎడమ వైపు తిప్పడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే చనిపోగా, మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని 108లో సింగరేణి, గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సతీశ్ కొడుకు నవీశ్ సైతం చనిపోయాడు. సతీశ్ భార్య కీర్తి, సోదరి అనూష, బావ సతీశ్‌ను కరీంనగర్‌కు తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ తెలిపారు.
బాల్కొండ, వెలుగు : బైక్‌ను వెనుక నుంచి కంటెయినర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన బాల్కొండ మండలం చిట్టాపూర్ – శ్రీరాంపూర్ హైవేపై సోమవారం జరిగింది. ఏపీలోని ఒంగోలు జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (32) పదేండ్లుగా నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారంలో ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన బంధువును బైక్‌పై పెర్కిట్‌లో దింపి ఇంటికి వెళ్తున్నాడు. చిట్టాపూర్ – శ్రీరాంసాగర్ మధ్య హైవేపై బైక్‌ను వెనుక నుంచి కంటెయినర్ ఢీకొని, కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సైతం ఇటీవలే చనిపోయినట్లు తెలిసింది.