గంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి ..బిహార్​లో ఘటన 

గంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి ..బిహార్​లో ఘటన 

కతిహార్: బిహార్‌‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగా నదిలో పడవ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కతిహార్ జిల్లా అమ్దాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 17 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు నదిలో బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పది మందిని రక్షించామని, వారిలో ఎక్కువ మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

గల్లంతైన నలుగురు వ్యక్తుల ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తునకు ఆదేశించామని జిల్లా మేజిస్ట్రేట్ మనేశ్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు. బాధితులలో ఇద్దరిని పవన్ కుమార్ (60), సుధీర్ మండల్ (70) గా గుర్తించామని, మరొకరి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.