
- డాక్టర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ
- వనపర్తి జిల్లా అమరచింతలో ఘటన
వనపర్తి/మదనాపూరు, వెలుగు: పీహెచ్ సీ సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా కాన్పు చేసిన కారణంగా బిడ్డ చనిపోగా.. తల్లి ప్రాణాన్ని కాపాడిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. బంధువులు, వైద్య సిబ్బంది తెలిపిన ప్రకారం.. అమరచింత మండలం చంద్రగట్టు గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కాన్పు కోసం సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు అమరచింత పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది సాధారణ డెలివరీకి ప్రయత్నిచంగా ఎంతకూ కాకపోవడంతో పాటు శిశువు కాళ్లు మాత్రమే బయటకు వచ్చాయి. కాన్పు తమ వల్ల కాదని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అక్కడ కూడా కాన్పు చేసి కాపాడే ప్రయత్నంలో డాక్టర్లు ఫెయిల్ అయ్యారు.
కడుపులో మృత శిశువు ఉందని, తల్లి ప్రాణాలు కాపాడాలంటే వెంటనే సర్జరీ చేయాలని చెప్పడంతో స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి మృతశిశువును బయటకు తీసి తల్లి ప్రాణాలను కాపాడారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందని బంధువులు డీఎంహెచ్ఓ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా వెళ్లి విచారణ చేశారు. ఆస్పత్రిలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల నిర్లక్ష్యంతో సగం కాన్పు చేయడం కారణంగానే శిశువు చనిపోయినట్టు సోషల్‌మీడియాలోనూ వైరల్ అయి సంచలనంగా మారింది.