- ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో చంపేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
- తాగిన మైకంలో ఘటన
- లాక్కుని కాపాడిన యువకుడు
- హాస్పిటల్లో పాపకు ట్రీట్మెంట్
జడ్చర్ల, వెలుగు: ఓ తల్లి తన నెల రోజుల బిడ్డను గొంతు నులిమి చంపబోగా అక్కడే ఉన్న ఓ యువకుడు బిడ్డను లాక్కొని ప్రాణాలు కాపాడాడు. వెంటనే 108కు ఫోన్ చేయగా, తల్లీబిడ్డలను హాస్పిటల్కు తరలించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నఆదిరాలకు చెందిన పార్వతి, యాదయ్య భార్యాభర్తలు. వీరికి ఇదివరకే అనిత అనే మూడేండ్ల కూతురు ఉంది. నెల కింద మరో కూతురు పుట్టింది. దంపతులిద్దరూ కూలి పని చేసుకుని బతుకుతున్నారు. పని చేస్తే వచ్చే కూలీ డబ్బులు తిండి తినడానికి కూడా సరిపోవడం లేదు. దీంతో ఇద్దరు ఆడపిల్లలను ఎలా పోషించాలో తెలియక మదనపడుతున్నారు. సోమవారం భార్యాభర్తలు పిల్లలను తీసుకొని జడ్చర్లకు వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ కల్లు దుకాణంలోకి వెళ్లి ఫుల్లుగా తాగారు. తర్వాత యాదయ్య భార్యాపిల్లలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.
భర్త లేకపోవడంతో అతడి కోసం చుట్టూ వెతికింది. జాడ లేకపోవడంతో తనను వదిలేసి వెళ్లిపోయాడని భావించింది. ఇద్దరు పిల్లలను తాను ఎలా పోషించాలని అనుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. పిల్లలను తీసుకొని పాత బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లింది. అనితకు బిస్కెట్ప్యాకెట్ ఇప్పించింది. ముందు చేతిలో ఉన్న నెల రోజుల పసికందును చంపి తర్వాత పెద్ద బిడ్డతో కలిసి రైలు కింద పడి చనిపోవాలనుకుంది. పాపను గొంతు పిసికి చంపబోతుండగా అక్కడే ఉన్న ముబీన్అనే వ్యక్తి పరిగెత్తుకు వచ్చి పసికందును లాక్కున్నాడు. 108కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తల్లీబిడ్డను జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డాక్టర్లకు తన పరిస్థితిని వివరించింది. డాక్టర్లు ఇద్దరికి ట్రీట్మెంట్ఇస్తున్నారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.