కుత్బుల్లాపూర్: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం జరిగింది. ఓ విద్యార్థి క్లాసులో ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో క్యాంపస్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అరుణ్ కుమార్ అనే విద్యార్థి (19) మృతి చెందాడు. బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ క్లాసులో స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.
అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లనే అరుణ్ మృతి చెందాడని విద్యార్థుల ఆందోళన చేశారు. అసలు అరుణ్ కు ఏం జరిగింది..? ఎందుకు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు..? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టత లేదు. అనారోగ్య సమస్యలేమైనా ఉండటం వల్ల ఇలా జరిగిందా లేక ఉన్నట్టుండి సైలెంట్ హార్ట్ అటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల.. సైలెంట్ హార్ట్ అటాక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
చడీ చప్పుడు కాకుండా గుండె ఆగిపోవడమే సైలెంట్ హార్ట్ఎటాక్. ఇది ‘కోవర్ట్ కిల్లర్’ లాంటిది. అనుకోకుండా వచ్చే ఇలాంటి హార్ట్ఎటాక్స్ చాలా డేంజర్. అయితే, సివియర్ హార్ట్ఎటాక్ అనేది చెప్పాపెట్టకుండా రాదు. కొన్ని రోజులు, వారాల ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. లక్షణాలు కనిపించగానే అలర్ట్ కాకపోతే మాత్రం పరిస్థితి చేయిదాటిపోతుంది. హార్ట్ఎటాక్ సింప్టమ్స్‌ని ముందుగా పసిగట్టి, ట్రీట్మెంట్ తీసుకుంటే గుండెకి ఏ ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు.
నిజానికి సైలెంట్ హార్ట్ఎటాక్ అనేది ‘సైలెంట్’ కానేకాదు. నార్మల్ హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు ఛాతి భాగంలో తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. వాళ్లని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. అదే ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడంతో పాటు మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగాఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్‌లో కనిపించవు. అందుకే, చాలామంది వీటిని తరచూ వచ్చే అసౌకర్యం అనుకోవాలో లేదా గుండెపోటు సంకేతం అనుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతారు. అందుకే, వెంటనే డాక్టర్ని కలవరు. దాంతో వాళ్లకి ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుంది.