రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో మానవత్వం మంటగలిసింది. భార్య దివ్యాంగుడికి జన్మనిచ్చిందనే కారణంతో ఆమెను, కొడుకును దూరం పెట్టాడు. దీంతో.. ఆ వివాహిత భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తాపూర్ డివిజన్ హైదర్గూడలో భర్త ఇంటి ముందు భార్య బైటాయించింది. తన కొడుకుతో కలిసి న్యాయపోరాటానికి దిగింది. ఆ వివాహిత పేరు అలేఖ్య, ఆమె భర్త పేరు బీటుకూరి ఉదయ్ భాస్కర్. దివ్యాంగుడైన కొడుకును వదిలేసి తన ఇంటికి రావాలని ఉదయ్ భాస్కర్ తన భార్యను పట్టుబట్టాడు.
కన్న కొడుకును అలా ఎలా వదిలేస్తామని ఆమె ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బిడ్డ ఎలా పుట్టినా ఏ కన్న తల్లి పేగు బంధాన్ని తెంచుకోలేదు. కన్నతండ్రి అయిన ఉదయ్ భాస్కర్ తన కొడుకు విషయంలో ఇంత కర్కశంగా ప్రవర్తించడంపై అలేఖ్య కుటుంబం, ఆమె బంధువులు మండిపడుతున్నారు. అలేఖ్యకు మద్దతుగా ఆమె కుటుంబం, బంధువులు కూడా ఉదయ్ భాస్కర్ ఇంటి ముందు బైఠాయించారు. ఈ పరిణామంతో ఉదయ్ భాస్కర్ కుటుంబం, అలేఖ్య కుటుంబంతో గొడవ పెట్టుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులకు, భర్త కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లే అవకాశం లేకపోలేదు.