మేడిపల్లి: అయ్యప్ప మాలలో ఉన్నాడు. శాంతంగా ఉండాల్సింది పోయి కోపోద్రేకంతో రగిలిపోయాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలో భార్యని భర్త బండరాయితో కొట్టి చంపాడు. భర్త శ్రీకర్ రెడ్డి చేతిలో అతని భార్య రేవతి(33) దారుణ హత్యకు గురి కావడంతో ఇద్దరు పిల్లలు కన్న తల్లికి దూరమై శోకంతో విలపిస్తున్నారు. రేవతి భర్త శ్రీకర్ రెడ్డి ఈ మధ్యే అయ్యప్ప మాల ధరించాడు. దీక్ష బద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులతో, వాదోపవాదనలు చేయరాదు.
అయ్యప్ప మాల ధరించిన స్వాములు సమాజంలోని వ్యక్తులతో సంభాషించునపుడు గౌరవమర్యాదలను పాటించాలి. కోపాన్ని విడనాడాలి. ఇతరుల పట్ల జాలి,దయ, కరుణ కలిగి ఉండాలి. ఇవన్నీ శ్రీకర్ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నాడు. అయ్యప్ప మాలలో ఉండి భార్యతో గొడవ పడ్డాడు. భార్యాభర్తలు మనస్పర్థల కారణంగా తరచూ గొడవపడుతుండేవారు. అయ్యప్ప మాల ధరించినప్పటికీ శ్రీకర్ రెడ్డి కోపతాపాలు విడనాడలేదు.
ALSO READ | Horoscope : 2025లో ఏయే రాశుల వారికి డబ్బులు, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఉన్నత స్థాయికి చేరుకుంటారు..?
భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజంగా ఉండేవే. గొడవపడినంత సేపు కోపతాపాలకు లోనైనా కొంతసేపటికి ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గి మరొకరితో సౌమ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మనస్పర్థలు రాకుండా ఉండే విధంగా కలిసి కూర్చుని మాట్లాడుకుని భార్యాభర్తలు కలిసిపోవాలి. కానీ.. శ్రీకర్ రెడ్డి, రేవతి విషయంలో ఇలాంటిదేదీ జరగలేదు. ఇంట్లో పిల్లల ముందే ఇద్దరూ గొడవపడుతుండేవారు. ఇలా ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే పిల్లల మనసులు నొచ్చుకుంటాయని ఇద్దరూ గ్రహించలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తూ గొడవలు పడుతున్న సమయంలోనే శ్రీకర్ రెడ్డి అయ్యప్ప మాల ధరించాడు. ఇకనైనా.. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారని ఇరు కుటుంబాలు భావించాయి. అయినప్పటికీ ఈ భార్యాభర్తల తీరులో పెద్దగా మార్పు రాలేదు.
ఒకపక్క ఇంట్లో అయ్యప్ప స్వామికి పూజలు చేస్తూనే భార్యతో శ్రీకర్ రెడ్డి గొడవలకు దిగాడు. ఈ మనస్పర్థలు, గొడవలు తారా స్థాయికి చేరాయి. అయ్యప్ప మాలలో ఉన్నాడనే విషయాన్నే శ్రీకర్ రెడ్డి మర్చిపోయాడు. కోపోద్రేకం కట్టలు తెంచుకుని తన భార్య రేవతిని బండ రాయితో కొట్టి చంపాడు. ఈ ఘోరం గురించి తెలిసి ఇరుగుపొరుగున ఉండే వాళ్లు హడలెత్తిపోయారు. రేవతి పిల్లలను చూసిన వారికి కడుపు తరుక్కుపోయింది. ఇంట్లో పూజ చేసిన దగ్గరే రక్తపు మడుగు కనిపించింది. అయ్యప్ప నల్ల వస్త్రం రక్తపు మడుగులో పడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భీతావహ దృశ్యం చూస్తే జరిగిన ఘోరం కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రేవతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.