ఏపీలో విషాదం.. సమోసాలు తిని నలుగురు చిన్నారులు మృతి

విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాధాశ్రమంలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో నలుగురు మృతి చెందారు. సమోసా తిని విద్యార్థులు అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. వీరిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం నలుగురు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల్లో ముగ్గురిని జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు. ఫుడ్‌పాయిజన్‌ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యా శాఖ మంత్రి లోకేష్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.