సమ్మర్ హాలిడేస్కు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో.. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల పిల్లాడికి ఇలాంటి చావా..?

సమ్మర్ హాలిడేస్కు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో.. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల పిల్లాడికి ఇలాంటి చావా..?

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగనగర్లో విషాద ఘటన జరిగింది. కారు కింద పడి శివరాజ్ కుమార్ అనే 2 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు రోడ్డు పైకి వచ్చిన బాలుడిని కారు ఢీ కొట్టింది. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు శివరాజ్ కుమార్ ఇలా చనిపోవడంతో బాలుడి తల్లి కన్నీరుమున్నీరైంది. ఆమె రోదిస్తున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని కారుతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషాద ఘటనలతో పాటు నేరాలుఘోరాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో దారుణం జరిగింది. మానసిక ఆరోగ్య సమస్య కారణంగా కూతురుకి విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కన్న కూతురు జశ్విక(4)కి ఎలుకల మందు కూల్ డ్రింక్లో కలిపి ఇచ్చి కన్న తల్లి క్రిష్ణపావని (32) చంపేసింది. అనంతరం క్రిష్ణపావని (32) కూడా విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆత్మహత్య చేసుకునేందుకు ఎలుకల మందును కృష్ణ పావని ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. 18వ తేదీ సాయంత్రం ఎలకల మందును కలిపి కూతురికిచ్చి తను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున ఇద్దరి పరిస్థితిని గమనించి భర్త, స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

నాలుగేళ్ళ చిన్నారి జశ్విక చికిత్స పొందుతూ సాయంత్రానికి చనిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి కృష్ణ పావని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కృష్ణ పావనికి అనారోగ్య సమస్యల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భర్త సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణ పావని కూతురు జశ్వికకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.